సాధారణంగా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి సంబరాలు చేసుకోగా.. ఓడిన అభ్యర్థి నిరాశకు గురవుతూంటారు. అయితే హరియాణాలో మాత్రం ఓడిన అభ్యర్థికి గ్రామస్థులు అరుదైన కానుకలు ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. హరియాణాలోని ఫతేహాబాద్ లోని నాధోడి గ్రామానికి పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ సర్పంచ్ ఎన్నికల్లో సుందర్, నరేంద్ర అనే ఇద్దరు అభ్యర్థులు పోటీ చేశారు. ఆ గ్రామంలో మొత్తం 5,085 మంది ఓటర్లు ఉన్నారు. వీటిలో 4,416 ఓట్లు పోలయ్యాయి.
ఈ పంచాయితీ ఎన్నికల్లో నరేంద్ర 2,201 ఓట్లతో గెలుపొందాడు. ఇక సుందర్ 2,200 ఓట్లతో ఓటమి చెందాడు. కేవలం ఒక్క ఓటు తేడాతో సుందర్ ఓడిపోయాడు. దీంతో సుందర్ ని నాధోడి గ్రామస్థులు రూ.11,11,000 నగదు అందించి సన్మానించారు. అలాగే ఓ స్విప్ట్ డిజైర్ కారు, కొంత భూమిని సైతం అతడికి ఇచ్చారు.
నగదు, కారు ఖరీదును గ్రామస్థులు విరాళాలు వేసుకుని ఇవ్వగా.. అదే గ్రామానికి చెందిన సుభాశ్ అనే వ్యక్తి భూమిని ఇచ్చారు. గ్రామస్థులు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. ఈ క్రమంలో గ్రామస్థులకు సుందర్ కృతజ్ఞతలు తెలియజేశాడు. గ్రామస్థుల ప్రేమే తనకు పెద్ద విజయమని పేర్కొన్నాడు. గ్రామస్థులతో కలిసి గ్రామాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని సుందర్ తెలిపాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్తా నెట్టింగ్ జోరుగా షికారు చేస్తోంది.
ఇక మరోవైపు.. హరియాణా, ఫరీదాబాద్ లోని ఫతేపూర్ తాగా గ్రామానికి కొత్త సర్పంచ్ గా ఎన్నికైన ఆస్ మహ్మద్ ని గ్రామస్థులు ఘనంగా సత్కరించారు. రూ.11,00,500 విలువైన నోట్లతో భారీ గజమాల తయారు చేసి సర్పంచ్ మెడలో వేశారు. గ్రామస్థులు సర్పంచ్ ని సన్మానిస్తున్న ఫొటోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.