ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం సరైనదా?.. కాదా ? అనే విషయాన్ని పక్కన పెడితే అసలు యుద్ధనీతినే రష్యా మరిచిపోయిందన్న విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. యుద్ధంలో మహిళల, చిన్నపిల్లలకు హాని కలిగించకూడదన్న కనీస ధర్మాన్ని కూడా పాటించకుండా రష్యా కర్కశత్వాన్ని ప్రదర్శిస్తోందని విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.
ప్రధానంగా వీరత్వం ప్రదర్శించాల్సిన చోట పురుషత్వంతో రష్యన్ బలగాలు రెచ్చిపోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాము యుద్ధం కోసం వచ్చామన్న విషయాన్ని మరిచి వారు వికృత చేష్టలకు దిగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కనీస మానవత్వాన్ని మరిచి రష్యన్ సైనికులు పశువాంఛలు తీసుకుంటున్నట్టు ఉక్రెయిన్ మహిళలు వాపోతున్నారు.
కేర్సన్ రీజియన్ లో ఓ రష్యన్ సైనికుడు చేసిన బెదిరింపులను వివరిస్తూ ఓ బాలిక పెట్టిన ట్వీట్ అందరిని విస్మయానికి గురిచేస్తోంది. తనకు పడక సుఖం అందించకుంటే మరో 20 మంది సైనికులను తీసుకు వచ్చి లైంగిక దాడి చేయిస్తానంటూ బెదిరించి లైంగికదాడికి దిగిన తీరును వర్ణిస్తూ చేసిన ట్వీట్ ఆ సైనికుల వికృత చేష్టలకు పరాకాష్టంగా నిలుస్తోంది.
ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారం చేసే విషయంలో ఓ రష్యన్ సైనికుడికి అతని భార్య నవ్వుతూ అనుమతిచ్చిన ఘటన చూస్తే ఉక్రెయిన్ లో మహిళల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందని అధికారులు చెబుతున్నారు.
ఒక రష్యన్ సైనికుడు తన భార్యతో మాట్లాడుతుండగా అతని ఫోన్ ను ట్రాప్ చేసి వారి సంభాషణలు విన్న ఉక్రెయిన్ అధికారులు ఖంగుతిన్నారు. ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారం చేసేందుకు ఆ రష్యన్ సైనికుడికి అతని భార్య నవ్వుతూ అనుమతులు ఇవ్వడం విని అధికారులు ఆశ్చర్యపోయారు.
ఇది కేవలం మచ్చుకు ఒకటి మాత్రమే. ఇంకా ఇలాంటి ఘటనలు ఇంకెన్నో ఉన్నాయని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. రష్యన్ సైనికులపై 400లకు పైగా లైంగికదాడి కేసులు నమోదయ్యాయంటేనే రష్యన్ సైనికులు తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అధికారులు అంటున్నారు.
ఉక్రెయిన్ మహిళలపై రష్యన్ సైనికుల దాష్టికాలను అంతర్జాతీయ సమాజం తప్పుపడుతోంది. యుద్ధనీతిని మరిచి రష్యా యుద్ధం చేస్తోందని, ఈ యుద్ధంలో రష్యా గెలిచినా నైతికంగా మాత్రం ఓడిపోయినట్టేనని చెబుతోంది.