రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై యూపీ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ మేరకు ఆయనకు కమిషన్ నోటీసులు పంపింది. ఈ నెల 10న కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.
ఆయన వ్యాఖ్యలు కేవలం ఒక మహిళకే కాకుండా రాజ్యంగ బద్దంగా ఎన్నికైన ఒక ప్రభుత్వాధినేతకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ అన్నారు. మహిళ అయినందుకే ఆమెపై అలాంటి వ్యాఖ్యలు చేశారా అని ఆమె ప్రశ్నించారు.
ఆ వ్యాఖ్యలను ఖచ్చితంగా ఖండించాల్సిందేనని ఆమె అన్నారు. ఆయన అలాంటి అవమానకరమైన భాషను ఉపయోగించడం సిగ్గు చేటని ఆమె మండిపడ్డారు. అందుకే ఆయనకు కమిషన్ తరఫున నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై యూపీ కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ద్రౌపది ముర్ము వంటి రాష్ట్రపతి మరే దేశంలోనూ ఉండరని అన్నారు. చెంచాగిరీకి కూడా హద్దులు ఉంటాయని రాష్ట్రపతిపై వ్యాఖ్యలు చేశారు.
70 శాతం మంది ప్రజలు గుజరాత్ ఉప్పునే తింటారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల వ్యాఖ్యలు చేశారు. దానిపై ఆయన స్పందిస్తూ మీరు నిజంగా ఉప్పు తిని బతుకుతుంటే మీకే ఆ విషయం తెలుస్తుందని తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.