– నువ్వా నేనా అన్నట్టుగా ప్రత్యుత్తరాలు
– దర్యాప్తు సంస్థది అత్యుత్సాహమే అంటున్న కవిత
– సుప్రీంలో మరో పిటిషన్? ఈడీ సందిగ్ధం!
– ఈడీ చేయాల్సింది ఏంటి? చేస్తోంది ఏంటి..?
– ఓవర్ యాక్షనే కేసును నీరు గారుస్తోందా?
– ఈడీ, బోడీ, మోడీ అనడానికి కారణాలు ఇవేనా?
– 20న కవిత అరెస్టుకు పావులు కదుపుతున్న ఈడీ?
– తొలివెలుగు ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్
క్రైంబ్యూరో, తొలివెలుగు:లిక్కర్ స్కాంలో కేసు నమోదు చేసి సీబీఐ ఎంతో అచితూచి అడుగులు వేసింది. 180 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి, 29 సార్లు విచారించిన తర్వాత సిసోడియాను అరెస్ట్ చేసింది. ఎమ్మెల్సీ కవితను ఇంట్లో విచారించిన సీబీఐ అనంతరం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. కానీ, ఈడీ మాత్రం కనీస చట్టాన్ని, ప్రిన్సిపుల్స్ ను పట్టించుకోవడం లేదని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు.. ఆ విచారణ ఎలా ఉండాలో తొలివెలుగు వివరించే ప్రయత్నం చేస్తోంది. మనీ లాండరింగ్ కే పరిమితమయ్యే ఈడీ మోకాలుకు బోడి గుండుకు ఎలా ముడిపెడుతుందో చెప్పే ప్రయత్నమిది.
మనీలాండరింగ్ నిర్వచనం!
మనీలాండరింగ్ అనేది వారి అక్రమార్జన మూలాన్ని దాచి పెట్టి నేరపూరిత ఆదాయాన్ని ప్రాసెస్ చేయడం. ఆదాయం చట్టప్రకారంగా సంపాదించినట్లుగా కనిపిస్తుంది. కానీ, వాటిని మరో కంపెనీకి లేదా ఇతర బినామీలకు బదలాయించడం ద్వారా అన్ అకౌంటబుల్ మొత్తం బయటపడుతుంది. పీఎంఎల్ఏ చట్టం 2002 సెక్షన్ 2(యూ) ద్వారా నేర పరంగా సంపాదించిన ఆదాయానికి నిర్వచనం ఇచ్చారు.
న్యాయ నిపుణుల చెబుతున్న వివరాల ప్రకారం.. నేరం ద్వారా వచ్చిన రాబడికి షెడ్యూల్ నేరానికి సంబంధం ఉండాలి. క్రిమినల్ కార్యకలాపాల ద్వారా ఎవరైనా ఒక వ్యక్తి ప్రతిఫలంగా లాభం పొందాలి. వీటికి సంబందించి సెక్షన్ 2(పీ), సెక్షన్ 3, నేరం వాస్తవంపై వివరిస్తుంది. సెక్షన్ 2(ఎన్ఏ) దర్యాప్తు గురించి చెబుతుంది. విచారణ జరిపేందుకు గాను జరిగిన నేరానికి లింక్ చేసి ఉండాలి. సెక్షన్ 4, మనీలాండరింగ్ నేరానికి సంబంధించిన శిక్షను ఖరారు చేస్తుంది.
అది మూడు సంవత్సరాల కంటే తక్కువ కాకుండా ఏడు సంవత్సరాల వరకు గరిష్టంగా పదేళ్లు ఉంటుంది. ఐదు లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. సెక్షన్ 5 మనీ లాండరింగ్ నేరానికి సంబంధించిన ఆస్తి అటాచ్ మెంట్ గురించి చెబుతుంది. సెక్షన్ 19 ప్రకారం అరెస్టు ఉంటుంది. డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, లేదా స్పెషల్ ఆఫీసర్ అతని వద్ద ఉన్న మెటీరియల్ ఆధారంగా నమ్మదగిన కారణం ఉండే విధంగా చట్టానికి లోబడి శిక్షార్హమైన నేరంతో అరెస్ట్ చేయవచ్చు. కోర్టుకు పత్రాలన్నీ సమర్పించాలి.
రిమాండ్ రిపోర్టులో ఎలాంటి భయాందోళనకు గురి చేసి రాయించి ఇవ్వరాదు. 160 స్టేట్ మెంట్ రికార్డు చేస్తారు. సెక్షన్ 24 ప్రకారం బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ తో వ్యవహరించాలి. అయితే.. ఏ కేసులోనైనా ఈడీ నిందితులు తాము నిర్దోషులమని, మనీలాండరింగ్ నేరంలో తమకు సంబంధం లేదని నిరూపించాలి. సీబీఐలో అయితే.. నిందితుడు నేరం చేసినట్లు రుజువు చేయాలి. అప్పుడే, ఈడీకి ఉన్న పవర్ తో దేశ అర్ధిక వ్యవస్థను దెబ్బతీసేలాగా వ్యవహరించారని నిరూపించే అవకాశాలు ఉంటాయి. సెక్షన్ 5o సమన్ల జారీ, ప్రత్యుత్తరాల గురించి చెబుతుంది.
పత్రాల తయారీ, సాక్ష్యం ఇవ్వడం మొదలైన వాటికి సంబంధించి అధికారుల అధికారాలపై ఉంటుంది. సబ్-సెక్షన్లు (2),(3) ప్రకారం భారతీయ శిక్షాస్మృతి, 1860, 45 ఆఫ్ 1860 సెక్షన్ 193, సెక్షన్ 228 ద్వారా న్యాయపరమైన విచారణగా స్వీకరిస్తారు. సీబీఐ కంటే ఈడీకి ఒక పవర్ ఫుల్ అధికారం ఉంది. సీబీఐలో మెజిస్ట్రేట్ ముందు తప్పుడు సమాచారం ఇచ్చినా కోర్టు విచారణలో డిసైడ్ చేస్తుంది. ఈడీలో తప్పుదారి పట్టించేలా అబద్దపు సమాచారం ఇస్తే ఐపీసీ 193 ప్రకారం శిక్షకు గురవుతారు. ఇది ఈడీకి ఒక ఆయుధం.
ఈడీకి సీబీఐకి విచారణలో తేడా ఇదే!
షెడ్యూల్ చేసిన నేరాన్ని సీబీఐ విచారిస్తుంది. ఈడీ మనీలాండరింగ్ నేరాన్ని మాత్రమే విచారించాల్సి ఉంటుంది. షెడ్యూల్డ్ నేరానికి సంబంధించిన ప్రశ్నను ఈడీ అడగదు. వాటిపై కోర్టులో అభ్యంతరం చెప్పవచ్చు. ఇప్పుడు లిక్కర్ స్కాంలో అంతా తానై ఈడీ నడిపిస్తోంది. అందుకే, సీబీఐ పని కూడా ఈడీ చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. నేరానికి సంబంధించిన సాక్ష్యాలను సీబీఐ సేకరించాలి. అంటే, ఎక్సైజ్ పాలసీ, అందులో ఉండే లోపాలు, తప్పుడు పాలసీని రూపొందించడంలో ఎవరి పాత్ర ఎంటనేది కీలకం. ఈడీ షెడ్యూల్డ్ నేరంలో మనీ ట్రయల్ కు సంబంధించిన సాక్ష్యాలను సేకరించాలి.
నిందితుడు, అతని మనీ ట్రాన్స్ ఫర్స్ దాని లాండరింగ్ ద్వారా షెడ్యూల్ చేయబడిన నేరం, వాటి ద్వారా వచ్చిన ఆదాయంపై విచారణ జరపాలి. కానీ, ఇక్కడ తప్పుడు పాలసీని రూపొందించడం, ఎక్సైజ్ పాలసీలో లోపం, ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన సాక్ష్యాలను నాశనం చేయడం వంటి వాటిని ఈడీ దర్యాప్తునకు ఆసక్తి చూపిస్తోందని విమర్శలు ఉన్నాయి. సెల్ ఫోన్స్ ధ్వంసం, చాటింగ్ వ్యవహారం అంతా సీబీఐ పరిధిలోనిది. ఈడీ అత్యుత్సాహంపై ఢిల్లీ హైకోర్టు తీర్పు నిచ్చింది. ప్రస్తుత ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీకి అవసరం లేని విషయాల్లో ఎక్కువ ప్రశ్నిస్తోంది. పాలసీని రూపొందించడంలో కవితతో మనీష్ సిసోడియా మధ్య సంబంధాలపై ప్రశ్నిస్తోంది.
ఆర్ధిక లావాదేవీలను వదిలేసి హింసించేలా ఈడీ వ్యవహరిస్తోందని, ఇది ఆర్టికల్ 20(2) కి విరుద్దమని కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇక సెక్షన్ 65 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ యాక్ట్ 1973 ప్రకారం చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అరెస్ట్ చేయడం, తనిఖీలు చేయడం. సీజ్ చేయడం కామన్. సీఆర్పీసీ 160 స్టేట్ మెంట్ రికార్డు కోసం మహిళలను ఇంట్లోనే విచారించవచ్చు. కవితను సీబీఐ హైదరాబాద్ లోని తన ఇంట్లోనే ప్రశ్నించింది. కానీ ఈడీ దీన్ని పట్టించుకోకుండా ఆఫీస్ కు పిలిచి వేధిస్తోందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారామె. మహిళల పట్ల అనేక నిబంధనలు ఉన్నాయి.
రాత్రి పూట విచారించవద్దు. మహిళా అధికారిని ఉండాలి. ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని రూల్స్ ఉన్నాయి. ఇలా ఎన్నో నిబంధనలను అతిక్రమిండం వల్లనే ఈడీ, మోడీ, బోడీ అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని అనిపిస్తోంది. కవిత న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని కోర్టుకు వెళ్లారు. అయితే, ఈడీ తలుచుకుంటే వెంటనే ఢిల్లీలోనే ఆమెను అరెస్ట్ చేయవచ్చు. తప్పు చేశారు.. సాక్ష్యాధారాలను తారుమారు చేయనున్నారని తెలిస్తే ఎయిర్ పోర్ట్ లోనైనా అదుపులోకి తీసుకోవచ్చు.
కానీ, అలాంటి వ్యవహారం ఆమె చేయడం లేదని నిర్ధారించుకుంటున్నారు. అందుకే, మరో తేదీ ఇచ్చి అప్పుడు రావాలని కోరుతున్నారు. ఇటు ఈనెల 24 వరకు వెళ్లేందుకు రెడీగా లేనని కవిత చెప్పకనే చెబుతున్నారు. ఇప్పటికీ నిందితుల జాబితాలో తాను లేనని అంటూనే విచారణకు సహకరిస్తానని అంటున్నారు. అయితే, కవితను ఈ నెల 20న అరెస్ట్ చేసేందుకు ఈడీ పావులు కదుపుతున్నట్టు సమాచారం.