విద్వేష పూరిత ప్రసంగాలపై సుప్రీం కోర్టు కన్నెర్ర జేసింది. రాష్ట్ర ప్రభుత్వాల అశక్తత, అధికార లేమి వల్ల, సమయానికి స్పందించక పోవడం వల్లే విద్వేష పూరిత ప్రసంగాలు జరుగుతున్నాయంటూ సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
రాజకీయాలు, మతం వేరు చేయబడిన క్షణం విద్వేష పూరిత ప్రసంగాలు ఆగిపోతాయని ధర్మాసనం పేర్కొంది. కేరళకు చెందిన షహీన్ అబ్దులా అనే జర్నలిస్టు దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడి ధర్మాసనం విచారణ చేపట్టింది.
విద్వేష ప్రసంగాలు ఓ విషవలయమని ధర్మాసనం పేర్కొంది. రాజకీయాలను మతాలను కలపడంతో పెను సమస్యకు దారి తీస్తోందని ధర్మాసనం పేర్కొంది. రాజకీయాలు, మతాలు విడిపోయిన తరుణంలో విద్వేష ప్రసంగాలు ముగిసిపోతాయని వెల్లడించింది.
మతాన్ని అడ్డు పెట్టుకుని చేసే రాజకీయాలు దేశ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. విద్వేష ప్రసంగాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం విఫలమైందని ధర్మాసనం పేర్కొంది.
టీవీ, ఇతర వేదికలపై ప్రతిరోజూ విద్వేష ప్రసంగాలు చూస్తూ ఉన్నామని వెల్లడించింది. అందులో మనం ఎంతమంది పైన కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోగలం అంటూ ప్రశ్నించింది. ఇతరులను దూషించకూడదని ఈ దేశ పౌరులు ఎందుకు ప్రతిజ్ఞ చేయలేరు? ఇతరులను దూషించడం వల్ల మీకు ఏం లాభం? అని ప్రశ్నించింది.