రాష్ట్రంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కొనసాగుతోంది. ఈ రోజు 11వ రోజు యాత్రలో భాగంగా స్టేషన్ ఘన్ పూర్ నియోజక వర్గంలో ఆయన పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా రైతులతో ఆయన ముచ్చటించి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ క్రమంలో నాగలితో పొలం దున్నుతున్న ఓ రైతు వద్దకు ఆయన వెళ్లారు. సేద్యం చేస్తున్న తీరును ఆయన ఆసక్తిగా పరిశీలించారు. ఆ తర్వాత రైతు దగ్గర నుంచి అరక తీసుకుని తాను దున్నే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న జనాలను చూసి ఎద్దులు బెదిరిపోయాయి.
ఆ ఎద్దులను నియంత్రించలేక రేవంత్ రెడ్డి ఇబ్బంది పడ్డారు. నాగలి కర్రును రేవంత్ గట్టిగా భూమిలోకి అదిమి పట్టుకోలేకపోయారు. దీంతో ఆ ఎద్దులు ఇష్టారాజ్యంగా పరుగులు తీశాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి అరక దున్నలేచ చాలా ఇబ్బంది పడ్డారు.
ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. వ్యవసాయం అంటే చాలా కష్టమని ఆయన అన్నారు. రైతుల శ్రమ అంతా ఇంతా కాదని ఆయన వెల్లడించారు. మనం హాయిగా ఇంటి వద్ద కూర్చుని అన్నాన్ని ఆస్వాదిస్తున్నామని చెప్పారు. రైతులందరికీ తాను సెల్యూట్ చేస్తున్నానన్నారు.