– వైఫల్యాలను ఎండగట్టడమే ధ్యేయం
– జనంలోకి బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలు
– వారానికి ఒక సమస్యపై ఛార్జిషీట్
– 12 మందితో కూడిన పర్యవేక్షణ కమిటీ
– రెండు నెలల పాటు హాత్ సే జోడో అభియాన్
– క్యాడర్ కదలి వస్తుందని కాంగ్రెస్ ఆశలు
హాథ్ సే హాథ్ జోడో యాత్రను ప్రతిష్టాత్మంకగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టేందుకు వేదికగా ఎంచుకుంది. ఏఐసీసీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పార్టీ బలోపేతం, బీఆర్ఎస్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకెళ్లేందుకు సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటోంది. రెండు నెలల పాటు కొనసాగనున్న ఈ యాత్రలో వారానికి ఒక సమస్య పై ఛార్జిషీట్ విడుదల చేస్తూ క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని భావిస్తోంది.
ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వివిధ రూపాల్లో జనంలోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసిన తరువాత ఆ యాత్రకు కొనసాగింపుగా దేశ వ్యాప్తంగా రెండు నెలల పాటు హాథ్ సే హాథ్ జోడో అభియాన్ చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఇప్పటికే జనవరి 26న లాంఛనంగా ప్రారంభించిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర దేశ వ్యాప్తంగా రెండు నెలలు కొనసాగనుంది.
ఈ క్రమంలో బీఆర్ఎస్,బీజేపీ పరిపాలనలో చోటు చేసుకున్న వైఫల్యాలను ఎండగట్టే పని మొదలు పెట్టింది. బీఆర్ఎస్ ఎనిమిదేళ్లుగా ఏయే వర్గాలను నిర్లక్ష్యం చేసింది. ఆయా వర్గాలు పడుతున్న ఇబ్బందులు ఏంటీ.. ఏయే శాఖలు నిర్వీర్యం అయ్యాయి.. వాటి వల్ల ప్రజలకు జరుగుతున్న నష్టం ఏంటి అనే అంశాలను తెరపైకి తీసుకొచ్చే దిశలో ముందుకు వెళుతోంది. ప్రతి వారం ఒక ప్రధాన సమస్యపై ఛార్జిషీట్ విడుదల చేయాలని నిర్ణయించింది.
హాథ్ సే హాథ్ జోడో యాత్ర నిర్వహణ పర్యవేక్షణకు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వరరెడ్డి నేతృత్వంలో 12 మందితో కూడిన పర్యవేక్షణ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ సమస్యల వారీగా ఛార్జిషీట్లను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే సమస్యలను గుర్తించిన నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజల బాధలను ఛార్జిషీట్లలో పొందుపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు.
బీఆర్ఎస్ ఎనిమిదేళ్లలో ఇచ్చిన హామీల అమలు తీరును ఎండగడుతూ మొదటి ఛార్జిషీట్ ను ఏలేటి మహేశ్వర రెడ్డి నేతృత్వంలో కమిటీ విడుదల చేసింది. వైద్య ఆరోగ్య శాఖ తీరు తెన్నులు అందులో ఉన్న లోటుపాట్లను ఎత్తిచూపుతూ రెండో ఛార్జి షీట్ ప్రకటించింది. మంగళవారం క్షేత్రస్థాయి పరిశీలన చేసి, ఆసుపత్రి నిర్మించినట్లు మంత్రి హరీశ్ రావు చెప్పిన మాటలు వాస్తవం కాదని చెప్పే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ కార్యక్రమాల వల్ల క్యాడర్ కదలిక రావడంతో పాటు పార్టీ బలోపేతం అవుతుంది నాయకత్వం అంచనా వేస్తోంది.