సమ్మక్క సారక్కల పోరాట స్ఫూర్తితో ఈ యాత్ర మొదలు పెట్టామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ‘హాథ్ సే హాథ్’ యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ములుగు ముద్దుబిడ్డ.. మా ఆడబిడ్డ సీతక్క అండతో.. మేడారంలో ఈ యాత్ర మొదటి అడుగు పడిందన్నారు. మీ అభిమానాన్ని.. మీరిచ్చిన పౌరుషాన్ని గుండెల నిండా నింపుకుని.. రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు కదిలామన్నారు. వరి, మిర్చి, పత్తి కూలీల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. ఆనాడు 10 లక్షల ఎకరాల భూములు మేము పంచితే.. హరిత హారం పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల భూములు గుంజుకుంటున్నారన్నారు.
60 ఏళ్ల ఉద్యమకారుల ఆకాంక్ష, అమరుల త్యాగాలను గుర్తించిన సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ 10 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. తొమ్మిదేళ్లలో 23 లక్షల కోట్లు ఇస్తే.. ఒక్కో నియోజకవర్గానికి 20 వేల కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ డబ్బుతో ములుగులో లక్షకుపైగా పేదలకు ఇళ్లు ఇచ్చి ఉండాలి.. మరి ఇచ్చారా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు భృతి ఇస్తానన్న కేసీఆర్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఆరోగ్యశ్రీకి కేసీఆర్ ప్రభుత్వం 800 కోట్లు బకాయి పడ్డారు.
23 లక్షల కోట్లు ఎవడు కొల్లగొట్టాడు? 2001లో రబ్బరు చెప్పులు కూడా లేని నీ కుటుంబం.. హైదరాబాద్ చుట్టూ ఫామ్ హౌసులు కట్టుకుందన్నారు. తొమ్మిదేళ్లలో 10వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.. కానీ 80 వేల మంది రైతులు చనిపోయారని రాష్ట్ర మంత్రే ఒప్పుకున్నారు. గాలి మాటలు చెప్పి.. గాలి మోటర్లో తిరుగుతున్నారన్నారు. జనవరి 1, 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. జనవరి 1, 2024న సమ్మక్క సారక్క ములుగు జిల్లా జీవో ఇచ్చే బాధ్యత మేం తీసుకుంటామన్నారు.
పోడు భూముల సమస్యలు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించదన్నారు. 2024లో హక్కులు, అర్హతల ప్రకారం పోడు భూములు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. ములుగులో గిరిజన యూనివర్సిటీ తెచ్చే బాధ్యత కాంగ్రెస్ ది అన్నారు. మీరు అనుకుంటే కేసీఆర్ ను గద్దె దించడం పెద్ద విషయం కాదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణలో సంక్షేమ రాజ్యం వస్తుందన్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞత తెలుపుదామన్నారు రేవంత్ రెడ్డి.