కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 2019లో 8 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను విలీనం చేసి 4 బ్యాంకులుగా మార్చుతున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. అయితే అందులో భాగంగానే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం అయ్యాయి. అలాగే సిండికేట్ బ్యాంక్ ను కెనరా బ్యాంక్‌లో కలిపారు. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు. అలహాబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంకులో విలీనం చేశారు.
అయితే కేంద్రం విలీనం చేసిన 8 బ్యాంకుల్లో అకౌంట్లు కలిగి ఉన్నవారు ఏప్రిల్ 1 లోగా కచ్చితంగా బ్యాంకులను సందర్శించాలి. అక్కడ కొత్త చెక్ బుక్‌లను తీసుకోవాల్సి ఉంటుంది. పాత చెక్ బుక్‌లు పనిచేయవు. దీంతోపాటు బ్యాంకులకు చెందిన ఐఎఫ్ఎస్‌సీ నంబర్లు కూడా మారుతాయి. కనుక ఆ వివరాలను కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది.
దేనా బ్యాంక్, విజయా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంకులకు చెందిన వినియోగదారులు తమకు సమీపంలో ఉన్న బ్యాంకు బ్రాంచిని సంప్రదించి కొత్త చెక్ బుక్‌లను పొందవచ్చు. పాత చెక్ లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి అనుమతించరు. కనుక కొత్త చెక్ బుక్‌లను కస్టమర్లు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.