హైదరాబాద్ లో వరుసగా హవాలా సొమ్ము బయటపడుతోంది. మునుగోడు ఉప ఎన్నిక కోసమే నగదు ట్రాన్స్ ఫర్ అవుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత పది రోజుల్లో పది కోట్లు దొరికాయి.
బుధవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో తనిఖీలు చేపట్టారు. ఓ వాహనంలో తరలిస్తున్న రూ.2 కోట్ల నగదు బయటపడింది. కొరియర్ సంస్థ ముసుగులో భారీగా డబ్బు చేరవేస్తున్నారు. పోలీసులు నిలదీయగా వివేక్ అనే వ్యక్తి.. అతడికి సంబంధించిన వారికి అందించేందుకు వచ్చామని చెప్పారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బంజారాహిల్స్ పోలీసులు. వివేక్ ఎవరు అనే అంశంపై విచారణ సాగుతోంది. పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు ఉన్నారు. పోలీసుల రాకను గుర్తించి డబ్బు తీసుకోకుండా వివేక్ మనుషులు పారిపోయినట్లు తెలుస్తోంది.
మునుగోడు షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి వరుసగా హవాలా సొమ్ము బయటపడుతోంది. గత పది రోజుల్లో పది కోట్ల రూపాయల సొమ్మును పోలీసులు పట్టుకున్నారు. ఇదంతా మునుగోడు ఉపఎన్నిక కోసమే చేతులు మారుతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మంగళవారం గాంధీనగర్ పరిధిలోని హోటల్ మ్యారియట్ దగ్గర టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 2 కార్లలో తరలిస్తున్న రూ.3.5 కోట్ల నగదును గుర్తించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపలేదు.