ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ విచారణ మూడడుగులు ముందుకు.. నాలుగడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది. కేసులో కీలకంగా భావిస్తున్న బీజేపీ నేత బీఎల్ సంతోష్, కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామిని టచ్ చేయలేకపోతున్నారు అధికారులు. తాజాగా బీఎల్, జగ్గు స్వామికి ఇచ్చిన నోటీసులపై హైకోర్టులో విచారణ జరగగా.. వారికే ఊరటనిచ్చేలా జరిగింది.
ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించి బీఎల్ సంతోష్ కు నవంబర్ 23న సిట్ నోటీసులు జారీ చేసింది. కానీ, బీఎల్ రాలేదు. ఆ నోటీసులపై హైకోర్టులో పిటిషన్ వేశారు. నవంబర్ 25న విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సిట్ జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. డిసెంబరు 5 వరకు స్టే కొనసాగుతుందని కోర్టు ప్రకటించింది. అలాగే జగ్గు స్వామి కూడా హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో విచారణ జరిపింది న్యాయస్థానం.
బీఎల్ సంతోష్ కు ఇచ్చిన 41ఏ సీఆర్‌పీసీ నోటీసులపై మరోసారి స్టే విధించింది. ఈనెల 13 వరకు స్టే పొడిగించింది. విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది. జగ్గు స్వామికి ఇచ్చిన నోటీసులపైనా స్టే విధించింది న్యాయస్థానం. ఆయన పిటిషన్ పైనా అవే ఉత్తర్వులు ఇచ్చింది.
నోటీసులపై ఈనెల 13 వరకు స్టే విధించగా.. బీఎల్ సంతోష్ కేసులో కౌంటర్ దాఖలుకు సమయం ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. దీంతో వారికి సమయం ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది.