గత రెండు మూడు సంవత్సరాల నుంచి రూ.5, రూ. 10 నాణేలను కస్టమర్స్ నుంచి తీసుకోవడానికి వ్యాపారస్తులు అభ్యంతరం చెప్తున్నారు.. అదే సమయంలో వ్యాపారస్తుల నుంచి చిల్లరగా.. ఈ నాణేలను తీసుకోవడానికి వినియోగదారులు సంకోచిస్తున్నారు. అయితే.. ఓ వ్యక్తి.. రూ. 10 నాణేల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
అయితే.. రూ.10 నాణేలను ప్రజలు తీసుకోకపోవడంతో విసుగు చెందిన అతను.. కేవలం ఆ చిల్లర నాణేలతో కారు కొనాలని నిర్ణయించుకున్నాడు. దీంతో గత కొన్ని నెలలగా రూ. 10 నాణేలను సేకరించి ఇప్పుడు వాటితో ఏకంగా కారుని కొనుగోలు చేశాడు. ఈ విచిత్రమైన ఘటన తమిళనాడు లో చోటుచేసుకుంది.
ధర్మపురి అరూర్‌కు చెందిన వెట్రివేల్ కారు కొనుగోలు కోసం దాదాపు నెల రోజుల పాటు.. రూ.6 లక్షల విలువైన రూ.10 నాణేలను సేకరించాడు. నాణేలను తీసుకుని కారు ఇవ్వడానికి తొలుత డీలర్ షిప్ సంకోచించినప్పటికీ.. వెట్రివేల్ దృఢ నిశ్చయాన్నీ చూసి డీల్ కు అంగీకరించారు.
ధర్మపురిలోని ప్రముఖ వాహన డీలర్ షాప్ కు కారు కొనుక్కోవడానికి వెళ్లిన వెట్రివేల్ ను చూసిన అక్కడి వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే.. అతను కారు కొనడానికి పోగు చేసిన రూ.10 నాణేలతో కూడిన చిల్లర డబ్బునంతా ఓ వాహనం నిండా పోసుకొని షోరూమ్ కి వెళ్లాడు. అయితే.. తన తల్లి దుకాణం నడుపుతుంటుందని.. అయితే కస్టమర్లు రూ. 10 నాణేలను తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు.
అంతేకాదు అనేక సందర్భాల్లో తన ఇంటి వద్ద పెద్ద మొత్తంలో నాణేలు ఉన్నాయని చెప్పాడు వెట్రివేల్. ఇందుకు సంబంధించిన పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్ లు కామెంట్ లు పెడుతున్నారు. కొందరు చిల్లర డబ్బులతో కారు కొనడం ఏంటి..? అని ఆశ్చర్యంగా కామెంట్ పెడుతుంటే.. ఇంకొందరు మాత్రం ప్రజలను మేల్కొల్పడం కోసం మంచి నిర్ణయం తీసుకున్నారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.