- విపక్షాల ఐక్యతా యత్నాలు …నితీష్ కి పీకే ‘బ్రేక్’ ?
2024 ఎన్నికల నేపథ్యంలో బీజేపీని గద్దె దింపడానికి విపక్షాల ఐక్యతకోసం ఢిల్లీ యాత్రలు చేస్తున్న బీహార్ సీఎం నితీష్ కుమార్ కి ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. (పీకే) ‘కంట్లో నలుసు’ లా మారారు. ఒకప్పుడు ఇద్దరూ జిగ్రీ దోస్తుల్లా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు శత్రువులయ్యారు. ప్రధాని మోడీని ఎదుర్కోవడానికి నితీష్ ఓ వైపు ఢిల్లీ వెళ్లి విపక్ష నేతలతో చర్చలు జరుపుతుంటే మరోవైపు పీకే.. మోడీ పక్కన చిరునవ్వులు చిందిస్తున్న నితీష్ ఫోటో పెట్టి.. ఈయన బహుశా బీజేపీకి సాయపడుతుండవచ్చు అని తాజాగా ట్వీటించారు. ఈ కామెంట్ ఒక్కటి పెట్టి ఆ తరువాత దాన్ని డిలీట్ చేశారు.
నరేంద్ర మోడీ పక్కన నితీష్ నిలబడిన నాలుగు ఫోటోలను ఆయన పోస్ట్ చేశారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుని బీహార్ లో జేడీ-యూ, తేజస్వి యాదవ్ ఆధ్వర్యంలోని ఆర్జేడీలతో బాటు కాంగ్రెస్ ని కూడా కలుపుకుని నితీష్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి పీకే ఎందుకో ఫైరవుతున్నారు. నెల క్రితం ఆయన పాలక బీజేపీతో ఉన్నారని, ఇప్పడు విపక్షంతో చేతులు కలిపారని-కానీ ఈ పరిణామం దేశంపై ప్రభావం చూపదని భావిస్తున్నానని ప్రశాంత్ కిషోర్ అన్నారు. అసలు ఏమిటీ రాజకీయం అని ప్రశ్నించారు.
పీకే చేసిన ఈ కామెంట్లపై స్పందించిన నితీష్ కుమార్.. 2005 నుంచి బీహార్ అభివృద్ధికి మేం ఏం చేశామో ఆయనకు తెలుసా అని ప్రశ్నించారు. రబ్బిష్ మాట్లాడడంలో పీకే నిపుణుడని ఆరోపించారు. ప్రశాంత్ కిషోర్ బీజేపీ వైపు ఉండాలనుకుంటున్నారా లేక రహస్యంగా ఆ పార్టీకి సాయం చేయాలనుకుంటున్నారా అని నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలతో కలిసి ‘బిజినెస్’ చేయడం ఆయన అలవాటని, బీహార్ లో ఆయన ఏం చేస్తాడో తమకు అనవసరమని అన్నారు. అసలు ‘ఏబీసీ’ అంటే ఏమిటో పీకేకి తెలుసా అని కూడా నితీష్ ప్రశ్నించారు.
నేను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని, ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ని, సీపీఎం నేత సీతారాం ఏచూరిని, ఎన్సీపీ నేత శరద్ పవార్ ని కలిశాను.. ఇతర విపక్ష నేతలతో కూడా భేటీ అవుతాను.పైగా సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ని కలిసిన విషయం తెలిసిందే అన్నారు. . విదేశాల నుంచి వచ్చాక కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సైతం సమావేశమవుతాను అని నితీష్ కుమార్ చెప్పారు. తమది థర్డ్ ఫ్రంట్ కాదని, ‘మెయిన్ ఫ్రంట్’ అని స్పష్టం చేశారు. ప్రజలకు ఏ మేలూ చేయని బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమన్నారు.