హైదరాబాద్ లో ఇటీవల చైన్ స్నాచింగ్స్ తీవ్ర కలకలం రేపాయి. ఈ నెల 19న ఒక్కరోజే వరుస ఘటనలు పోలీసులకు పెద్ద సవాల్ గా మారాయి. అయితే.. ఈ దొంగతనానికి పాల్పడిన దుండగుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడు రాజస్తాన్‌కు చెందిన ఉమేష్ ఖతిక్ అని సైబరాబాద్ SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Advertisements
ఉమేష్ ఖతిక్ కోసం పోలీసులు గుజరాత్, మహారాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి అహ్మదాబాద్ లో అరెస్ట్ చేశారు. నిందితుడు ఈ నెల 19న ఒక్క రోజే హైదరాబాద్‌లో పలు చోట్ల స్నాచింగ్‌లతో ఉమేష్ కలకలం సృష్టించాడు. ఆ ముందురోజు హైదరాబాద్‌కు వచ్చిన ఉమేష్.. బుధవారం ఉదయం నుంచి పక్కా ప్లాన్ తో సాయంత్రం లోపు ఐదు చైన్ లు దొంగతనం చేశాడు. ఆరోసారి ప్రయత్నించి విఫలం అయ్యాడు.
ముందుగా ఓ బైక్ ని దొంగతనం చేసి.. అదే బైక్ మీద తరువాత వ్యవహారం పూర్తి చేశాడు. మారేడుపల్లి, తుకారాంగేట్, పేటబషీర్‌బాద్, మేడిపల్లిలో చైన్ స్నాచింగ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ సమయంలో అతడు క్యాప్ పెట్టుకుని ఉన్నాడని అన్నారు. చివరిగా చేసిన ప్రయత్నంలో మాత్రం విఫలం అయ్యాడని చెప్పారు.
తరువాత నిందితుడు వరంగల్ కు అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. గుజరాత్, మహారాష్ట్రలో కూడా ఉమేష్ ఖతిక్‌పై చోరీ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది.