డీఎంకే లీడర్,మాజీ ఎంపీ ఎస్ మస్తాన్ మరణం మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ముందుగా గుండెపోటుగా భావించినా..కుటుంబ సభ్యులు అనుమానించినట్టుగా చివరికి హత్యే అని తేలింది. అయితే ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆయన్ని హత్య చేసింది సొంత బంధువే. ఆర్థిక లావాదేవీల కారణంగానే మస్తాన్ బంధువు, మరికొందరు కలిసి హత్య చేశారని పోలీసుల విచారణలో తేలింది.
అయితే ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు. ఎంపీ మస్తాన్ తమిళనాడు అధికార పార్టీ డీఎంకేలో కీలక వ్యక్తి. గతంలో ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం తమిళనాడు మైనారిటీ కమిషన్ వైస్ ఛైర్మన్ గా ఉన్నారు. ఇటీవల మస్తాన్ తన సోదరుడి అల్లుడు ఇమ్రాన్ బాషాతో కలిసి కారులో చెంగల్పట్టు వెళ్లారు.
ఈ సమయంలో మస్తాన్ కు గుండె నొప్పి వచ్చిందని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి.. తిరిగి వస్తుండగా గుండెపోటుతో మరణించారని ఇమ్రాన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే కుటుంబ సభ్యులు మస్తాన్ మరణంపై అనుమానం వ్యక్తం చేశారు. తన తండ్రి పోస్టుమార్టం నిర్వహించాలని మస్తాన్ కుమారుడు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటపడింది. ఈ విషయంపై గుడువంచేరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇక పోస్టుమార్టమ్ నివేదికలో మస్తాన్ ఊపిరి ఆడకుండా చనిపోయాడని తేలింది. దీంతో పాటు నిందితుడు ఇమ్రాన్ కార్యకలాపాలపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కారులోనే మస్తాన్ పై దాడి చేసి, ఊపిరాడకుండా చంపేశారని విచారణలో తేలింది. అయితే మస్తాన్ నుంచి ఇమ్రాన్ భారీ మొత్తంలో అప్పు తీసుకున్నాడు.. అది తిరిగి అడిగినందుకే ఈ హత్య చేసినట్టు విచారణలో తేలింది.