నెల్లూరు జల్లా కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య అందిస్తున్న కరోనా నివారణ ఔషధంపై అప్పుడే బురదజల్లడం మొదలైపోయింది. నిపుణుల బృందం ఇంకా ఏదీ తేల్చకముందే.. ఆయనపై మందుపై కొందరు వ్యతిరేక కథనాలు అల్లేస్తున్నారు. ఆనందయ్య ఇచ్చిన మందు తీసుకుని కోలుకున్న కోటయ్య అనే రిటైర్డ్ హెడ్‌మాస్టర్.. తాజాగా అస్వస్థతతో ఆస్పత్రికి రావడాన్ని తమ విష ప్రచారానికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆనందయ్య మందు రియాక్షన్ వల్లే ఇలా జరిగిందంటూ ప్రచారం చేస్తున్నారు.
మరోవైపు కోటయ్య కూతురు మాత్రం ఈ దుష్ప్రచారాన్ని ఖండిస్తోంది. ఆనందయ్య మందు తీసుకున్నాకే తన తండ్రి కోలుకున్నాడని..కరోనా నెగెటివ్ కూడా వచ్చిందని స్పష్టం చేస్తోంది. ఇంగ్లిష్ మందులు తన తండ్రికి పనిచేయలేదని, ఆనందయ్య ఇచ్చిన పసరే తన తండ్రి ప్రాణాలు కాపాడిందని తేల్చి చెబుతోంది. కేవలం నీరసంగా ఉండటం కారణంగానే మళ్లీ ఆస్పత్రికి వచ్చామని వివరించింది.
అటు కోటయ్య రెండు రోజుల క్రితం ఇదే మాట చెప్పాడు. తాను దాదాపుగా చనిపోయే దశకు చేరుకున్నప్పుడు ఆనందయ్య ఇచ్చిన మందే తనను కాపాడిందని.. రెండంటే రెండే నిమిషాల్లోనే కోలుకున్నానని తెలిపాడు. ఆయన మందు తీసుకున్న తర్వాత తనకు ఆక్సిజన్ అవసరం కూడా రాలేదని అన్నాడు. అలాంటి ఆయనేదో ప్రస్తుతం నీరసంగా ఉండి ఆస్పత్రికి వస్తే.. దానిపై కొన్ని మీడియాలు కొత్తగా వ్యతిరేక కథలు అల్లేస్తున్నాయి.