వరంగల్ కేఎంసీ పీజీ స్టూడెంట్ ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు నిమ్స్ డాక్టర్లు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమెకి వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నామన్నారు. మల్టీ ఆర్గాన్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎక్మో సపోర్ట్ తో చికిత్స అందిస్తున్నట్లు నిమ్స్ వైద్యులు వెల్లడించారు.
వైద్యుల ప్రకటనతో ప్రీతి కుటుంబసభ్యులు, తోటి విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని స్నేహితులు కోరుకుంటున్నారు.
కాగా జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి కేఎంసీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. శిక్షణలో భాగంగా ఎంజీఎంలో విధులు నిర్వహిస్తోంది. బుధవారం ఉదయం ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ లో విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
స్పృహలేని స్థితిలో ఉన్న ఆమెను వెంటనే అక్కడి నుంచి ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రీతి ప్రాణాల కోసం పోరాడుతోంది. ప్రీతిని కాపాడేందుకు నిమ్స్ వైద్యులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు.