కేంద్ర మంత్రి మన్సూఖ్ మాండవీయ
నిపుణుల నుంచి సిఫారసులు రాగానే 5 నుంచి 15 ఏండ్లలోపు పిల్లలకు కొవిడ్ వ్యాక్సినే పంపిణీ చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ తెలిపారు. అయితే ఇప్పటికి దీనికి సంబంధించి ఎలాంటి సూచనలకు తమకు అందలేదని వెల్లడించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
‘ ఏ గ్రూపు వారికి వ్యాక్సిన్ ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి అన్న అంశాలను నిపుణుల కమిటీ నిర్ణయిస్తుంది. మేము ప్రికాషనరీ డోసుకు సంబంధించి నిపుణుల సూచనలు అందిన వారంలోనే వాటిని అమలు చేశాము. 5 నుంచి 15 ఏండ్లలోపు పిల్లలకు సంబంధించి నిపుణుల నుంచి సిఫారసులు రాగానే వాటిని అమలు పరుస్తాము” అన్నారు.
‘ఇవన్నీ సైన్స్ కు సంబంధించినవి. అందువల్ల సిఫారసులు చేసేముందు శాస్త్రవేత్తలు, నిపుణులు పలు మార్లు అధ్యయనాలు చేస్తారు. గతంలో మనం ప్రపంచ దేశాల నుంచి వచ్చే సూచనలు పాటించే వాళ్లం, కానీ ఇప్పుడు మన శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ పై సొంతగా విశ్లేషణలు చేస్తున్నారు” తెలిపారు.
‘ ఈ రోజుల్లో వ్యాక్సినేషన్ పెద్ద సమస్య కాదు. మన దగ్గర కావాల్సినన్ని వ్యాక్సిన్లు ఉన్నాయి.
వ్యాక్సిన్లకు ఇప్పటి వరకు ఎలాంటి కొరత లేదు. మేము నిపుణుల సూచనల కోసం చూస్తున్నాము. ఆ సిఫారసులు అందగానే వాటిని మేము తప్పకుండా అమలు చేస్తాము” చెప్పారు.