అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం మరో సరికొత్త పథకాన్ని తీసుకువచ్చింది. అదే ‘ఆరోగ్య మహిళ’. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ‘ఆరోగ్య మహిళా’ పథకాన్ని కరీంనగర్ లో బుధవారం ప్రారంభించారు. బుట్టిరాజారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్రవ్యాప్తంగా 100 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. తెలంగాణలో మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ ఉగాది పండుగ తర్వాత ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి హరీశ్ రావు చెప్పారు.
వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళలకు చికిత్స అందించడానికి, పురుష వైద్యులు కాకుండా కేవలం మహిళా వైద్యులు మాత్రమే ఈ కేంద్రాల్లో ఉంటారని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్య మహిళా పథకంలో ఎనిమిది రకాల సేవలను అందించనున్నారు. ఈ పథకం ప్రకారం ప్రతి మంగళవారం గుర్తించిన క్లినిక్ లు మహిళల కోసం ప్రత్యేకంగా తెరిచి ఉంటాయనీ,
మహిళా వైద్యులు, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. చికిత్స అందించడంతో పాటు శస్త్రచికిత్సలతో సహా తదుపరి చికిత్స కోసం రోగులను (తీవ్రమైన రోగ నిర్ధారణ లేదా చికిత్స అవసరమైన వారు) జిల్లా కేంద్ర ఆసుపత్రికి రిఫర్ చేయడంతో పాటు మందులు ఇవ్వడం, పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని మంత్రి హరీశ్ రావు వివరించారు.
ఆరోగ్య మహిళా క్లినిక్ సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలనీ, ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు క్లినిక్లపై మహిళలకు అవగాహన కల్పించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను గురించి కూడా ప్రస్తావించారు. మహిళల సంక్షేమ కోసం ఆరోగ్య లక్ష్మి, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి కార్యక్రమాలు చేపట్టామనీ, మహిళా రక్షణ కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేతామహంతి, కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.