ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమీషనర్, ఆర్టీసీ ఇంచార్జీ ఎండి కోర్టుకు హజరయ్యారు. ఇప్పటికే వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేయగా… వాటిపై చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించింది.
హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు రెండు నివేదికలు కోర్టుకు సమర్పించగా… కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రెండు నివేదికలు వేర్వేరుగా ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని కోర్టు హెచ్చరించింది. రికార్డులు పరిశీలించే నివేదిక సమర్పించానని రామకృష్ణారావు కోర్టుకు తెలపగా… మొదటి నివేదిక పరిశీలించకుండానే ఇచ్చారా అని కోర్టు ప్రశ్నించింది. దీంతో సమయాభావం వల్ల అలా చేయాల్సి వచ్చిందని, మన్నించాలని కోర్టును కోరారు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి.
అయితే… కోర్టు మాత్రం క్షమాపణలు కోరటం కాదు, వాస్తవాలు చెప్పాలని కోరింది.
ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం చూపిస్తున్న లెక్కలపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి లెక్కలు, పదాలు వాడారని స్పష్టం చేసింది. తాజా నివేదికపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేస్తూ… బుణ పద్దుల కింద కేటాయించిన నిధులు అప్పు కాదని, గ్రాంటు అని తెలివిగా చెబుతున్నారని స్పష్టం చేసింది. ఇంతవరకు ఏ బడ్జేట్‌లో అలా చూడలేదని వ్యాఖ్యానించింది హైకోర్టు ధర్మాసనం
ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మపై హైకోర్టు సీరీయస్ అయ్యింది. ప్రభుత్వంకు సునీల్ శర్మ తప్పుడు లెక్కలు ఇచ్చారని, మంత్రికి కూడా తప్పుడు లెక్కలు ఇస్తే ప్రభుత్వాన్ని చీట్ చేసినట్లే అని వ్యాఖ్యానించింది.
క్యాబినెట్‌కు సైతం తప్పుడు లెక్కలు ఇచ్చారని, సీఎంను సైతం ఇవే తప్పుడు లెక్కలతో స్టేట్‌మెంట్ ఇప్పించారంది. మీ బాస్‌కే తప్పుడు సమాచారాన్ని ఇచ్చిన మిమ్మల్ని మేము ఎలా నమ్మాలి అని ప్రశ్నించింది.
తప్పుదోవ పట్టించిన ఆర్టీసీ ఇంచార్జీ ఎండీని రవాణ మంత్రి ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావటం లేదన్న హైకోర్టు, జీహెచ్‌ఎంసీ బకాయిలే లేనప్పుడు ఎందుకు అడుగుతున్నారని నిలదీసింది. బకాయిలు లేకపోతే మంత్రి ఇవ్వాలి అని ఎందుకు చెప్పారని నిలదీసింది. జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీ, ఆర్థిక శాఖలు ఒక్కొక్కరు ఒక్కో పాట పాడుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది.
హైకోర్టుతో… వ్యవహరించే తీరు ఇదేనా అని ఉన్నతాధికారులను ప్రశ్నించింది కోర్టు.
ఆర్టీసీ యాజమాన్యంకు, కార్మికుల మధ్య సయోధ్య చేయాలని తాము ప్రయత్నిస్తుంటే… ప్రభుత్వం, ఆర్టీసీ మాత్రం ముందుకు రావటం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ శాఖల మధ్య పూర్తిగా సమన్వయం లోపించిందని, నా స్థానంలో 5 నిమిషాలు మీరు ఉండి చూస్తే మీ నివేదికలు నమ్మేవిధంగా ఉన్నాయో అర్థమవుతోందని కోర్టు స్పష్టం చేసింది.
మీరు రవాణా శాఖ మంత్రితో తప్పుడు ఘణాంకాలతోనే అసెంబ్లీ వేదికగా తప్పులు మాట్లాడించారని, అవి తప్పులు కాకపోతే ఇప్పుడు కోర్టుకు ఇచ్చిన నివేదిక తప్పవుతుందని… లేదా అసెంబ్లీ నుండే ప్రజలకు తప్పులు చెప్పినట్లవుతుంది కదా అంటూ ఇంచార్జ్ ఎండిపై మండిపడింది కోర్టు. గత 15 సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు.
ఈ కేసులో కేంద్రం మరో కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. ఇప్పటికీ ఏపీఎస్ ఆర్టీసీ విభజన పూర్తికాలేదని కోర్టుకు తెలిపింది. ఏపీఎస్ ఆర్టీసీలో కేంద్రానికి 33శాతం వాటా ఉందని, అది టీఆఎస్‌ఆర్టీసీకి ఆటోమేటిక్‌గా బదిలీ కాదని వాదించింది. కేంద్రం తరుపున అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు వాదనలు వినిపిస్తున్నారు.
ఆర్టీసీ విభజన అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పగా… విభజనపై తమను అనుమతే కోరలేదని కేంద్రం స్పష్టం చేసింది. విభజన పెండింగ్‌లో ఉందని మీరే చెబుతూ, కొత్త ఆర్టీసీ ఏర్పాటు చేశామంటారు.. ఎలా సాధ్యమవుతుందని కోర్టు ప్రశ్నించింది. విభజన సమయంలో రెండు రాష్ట్రాలు కేంద్రాన్ని అనుమతి కోరాలి కదా, అనుమతి లేకుండా రెండు సంస్థలు ఎలా ఏర్పాటు చేస్తారని కోర్టు ప్రశ్నించింది.
తదుపరి విచారణ ఈనెల 11కు వాయిదా వేసింది.
ALSO READ: ఆర్టీసీ ఎండిపై హైకోర్టు సీరీయస్
http://tolivelugu.com/high-court-fire-on-rtc-md-sunil-sharma/