కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ విషయం ఉత్కంఠగా మారుతోంది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణ శనివారానికి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం పదిన్నరకు ప్రారంభమైన విచారణలో మొదట అవినాష్ రెడ్డి తరపు లాయర్లు 5 గంటల పాటు వాదనలు వినిపించారు. ఆ తర్వాత సునీతారెడ్డి తరపు లాయర్లు గంట పాటు తమ వాదనలు వినిపించారు. ఇక సీబీఐ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించాల్సి ఉంది. దీంతో శనివారం ఉదయానికి విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.
అవినాష్ రెడ్డి తరపు లాయర్ వాదన..
ఫోన్ కాల్స్ ఆధారంగా అవినాష్ రెడ్డిని కేసులో ఇరికించాలని చూస్తున్నారని అవినాష్ తరపు లాయర్లు వాదించారు. తల్లి అనారోగ్యం కారణంగానే అవినాష్ సీబీఐ విచారణకు హాజరు కాలేదని, అంతకు ముందు హాజరయ్యారని తెలిపారు. వివేకానంద రెడ్డిది హత్యో, గుండెపోటో చెప్పడానికి అవినాష్ రెడ్డి లాయరో, డాక్టరో కాదన్నారు. 2020 జులై 9న సీబీఐ FIR నమోదు చేసి 2021 జులై 21న రంగన్నను సీబీఐ విచారించిందని అవినాష్ రెడ్డి లాయర్ కోర్టుకు తెలిపారు. రంగన్న స్టేట్ మెంట్ రికార్డు చేసి సంవత్సరం పాటు వదిలేశారని, స్టేట్ మెంట్ లో క్లియర్ గా నలుగురి వివరాలు చెప్పాడని అవినాష్ న్యాయవాది అన్నారు.
అవినాష్ సాక్ష్యాధారాలు చెరిపేశారని ఆరోపించడం తగదన్నారు. రూ.4 కోట్లతో అవినాష్ కి సంబంధం ఏంటని ప్రశ్నించారు. కానీ సీబీఐ నెలరోజుల పాటు దస్తగిరిని విచారణకు పిలవలేదని, దస్తగిరిని ఒక్కసారి కూడా అరెస్ట్ చేయలేదని వాదించారు. మున్నా దగ్గర డబ్బు దొరికినా చార్జిషీట్ లో సాక్షిగా పేర్కొనలేదని, దస్తగిరి స్టేట్ మెంట్ లో అవినాష్ పేరు ఎక్కడైనా చెప్పాడా? అని జడ్జి ప్రశ్నించారు. దస్తగిరి దగ్గర 3 సార్లు 161 కింద సీబీఐ స్టేట్ మెంట్ తీసుకుందని, మొదటి స్టేట్ మెంట్ లో ఎక్కడా అవినాష్ గురించి చెప్పలేదని అవినాష్ చెప్పారు లాయర్.
సునీత తరపు న్యాయవాది వాదన..
వివేకా గుండె పోటుతో చనిపోయాడని చెప్పారని, రక్తపు వాంతులతో మృతి చెందినట్లు చెప్పారని, హత్య జరిగితే.. గుండె పోటు అని ఎలా చెపుతారని సునీతారెడ్డి తరపు న్యాయవాది ఎల్ రవిచందర్ వాదించారు. ఇందులో కుట్ర దాగి ఉందని, రాజారెడ్డి, గంగి రెడ్డి హాస్పిటల్ నుంచి వచ్చి కుట్లు వేశారని న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు అవినాష్ రెడ్డి, కృష్ణారెడ్డి, గంగిరెడ్డి, శంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నారని సునీతారెడ్డి తరుపు న్యాయవాది రవిచంద్ వాదించారు. దాదాపుగా గంట సేపు సునితారెడ్డి తరపు లాయర్.. న్యాయమూర్తికి తన వాదనలు వినిపించారు.
శనివారం సీబీఐ తరపు వాదనలు.. సీబీఐ లాయర్ వాదనలు శనివారం వింటామని న్యాయమూర్తి తెలిపారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన అదనపు వివరాలను న్యాయమూర్తి ముందు సీబీఐ అధికారులు ఉంచారు.
కాగా అవినాష్ రెడ్డి హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్నారు. అవినాష్ తల్లిని కర్నూలు నుంచి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు డిశ్చార్జ్ చేశారు వైద్యులు. తల్లి వెంట అవినాష్ రెడ్డి కూడా హైదరాబాద్ వచ్చారు. మరో వైపు జైల్లో ఉన్న అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి బీపీ పెరగడంతో.. నిమ్స్ లో చికిత్స చేయించి, మళ్లీ జైలుకు తరలించారు.