లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారణను ఈ నెల 21 కి వాయిదా వేసింది. అంటే ఇన్ని రోజులూ ఆయన జైల్లోనే గడపనున్నారు. ఆయన జుడిషియల్ కస్టడీ పొడిగింపుపై కోర్టు తన ఉత్తర్వులను రిజర్వ్ లో ఉంచింది. ఈ కేసులో ఆయనను 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ అంతకుముందు కోరింది. ఈ అభ్యర్థనను ఆయన తరఫు లాయర్ దయాన్ కృష్ణన్ వ్యతిరేకిస్తూ అసలు తన క్లయింట్ అరెస్టు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని, ఈ కేసులో ఈడీ ఇదివరకే ఆయనను ఎన్నోసార్లు ప్రశ్నించిందని అన్నారు.
అయితే కస్టడీ పొడిగింపునకు కోరిన కారణాలను ఈడీ లాయర్ వివరిస్తూ.. ఇప్పటివరకు చాలా సందర్భాల్లో సిసోడియా విచారణకు సహకరించలేదని, ఇతరుల పేర్ల మీద సిమ్ కార్డులను, మొబైల్ ఫోన్లనుఆయన కొనుగోలు చేశారని పేర్కొన్నారు.
ఆయన తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తూ వచ్చారు.. అసలు ఈ లిక్కర్ పాలసీ స్కామ్ లో మొదటి నుంచి.. నేరం బయటపడేవరకు ఎలా.. ఎన్ని సందర్భాల్లో అవకతవకలు జరిగాయివంటివన్నీ తాము తెలుసుకోవలసి ఉందని, ఇతర నిందితులకు, ఈయనకు మధ్య జరిగిన లావాదేవీల వివరాలను రాబట్టవలసి ఉందని ఈడీ తరఫు న్యాయవాది అన్నారు.
పెరిగిన ప్రాఫిట్ మార్జిన్ల విషయంలో సిసోడియా ఇచ్చిన స్టేట్మెంట్ కి,ఇతరుల వాంగ్మూలాలకు మధ్య చాలా తేడా ఉందని, దినేష్ అరోరాతో సిసోడియాకు గల ఆర్ధిక లావాదేవీలు ఇంకా స్పష్టం కావలసి ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక మనీలాండరింగ్ కేసులోకూడా తీహార్ జైల్లోనే సిసోడియాను అరెస్ట్ చేసి విచారించిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు.