గవర్నర్ తమిళి సై పై తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టులో హోలీ పండుగ తర్వాత విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం మార్చి2వ తేదీన సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీ నుంచి 11 వరకు సుప్రీం కోర్టుకు హోలీ సెలవులు ప్రకటించారు.
హోలీ సెలవుల తర్వాతే తిరిగి సుప్రీం కోర్టు కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. దీంతో మరో వారం రోజుల తర్వాతే తెలంగాణ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. గవర్నర్ తమిళి సై పై సర్కార్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను ఆమె అడ్డుకుంటున్నారని, వాటిని ఆమోదించడం లేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేరిట గురువారం 194 పేజీల పిటిషన్ దాఖలైంది. గవర్నర్ సెక్రటరీ, కేంద్ర లా సెక్రటరీని ప్రతివాదులుగా చేర్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం పిటిషన్ ను ఫైల్ చేస్తున్నట్లు తెలిపింది.
“ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించడానికి వీల్లేదు. ఆర్టికల్ 163 ప్రకారం సీఎం నేతృత్వంలోని మంత్రి మండలి, రాష్ట్ర సర్కారు సలహాలు, సూచనలకు లోబడే గవర్నర్ పనిచేయాల్సి ఉంటుంది” అని పిటిషన్ లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.