గుంటూరు : అంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఛాతినొప్పితో అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన్ని ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఎలాంటి ప్రాణప్రాయం లేదని వైద్యులు చెబుతున్నారు. కోడెల నరసరావుపేట, సత్తెనపల్లిలో రోజంతా పార్టీ నాయకులతో ఎడతెరిపి లేకుండా గడిపారు. తర్వాత ఇంటికి వెళ్లి కూర్చుని తాజా పరిణామాలపై పార్టీ నాయకులు, న్యాయవాదులతో ఫోన్‌లో చర్చిస్తుండగానే ఒక్కసారిగా ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే భద్రతా సిబ్బంది గుర్తించి ఆయన నివాసంలోనే ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. కోడెల అల్లుడు డాక్టర్ మనోహర్ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స ప్రారంభించారు. ఇటీవలి ఎన్నికల తరువాత ఆయన బాగా కృంగిపోయినట్టుగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీలో కంప్యూటర్ల చోరీ విషయమై కోడెల బాగా కదిలిపోయారు. అసెంబ్లీకి చెందిన ఫర్నీచర్ గుంటూరులో శివప్రసాదరావుకు చెందిన కార్యాలయంలో ఉందన్న సమాచారంతో అసెంబ్లీ సిబ్బంది వచ్చి పరిశీలించడం.. గుంటూరుకు చెందిన ఒక నాయకుడు ఆయన్ని తీవ్ర పదజాలంతో విమర్శించడం.. తదితర పరిణామాలతో కోడెల ఆందోళన చెందినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తనపై చేస్తున్న ఆరోపణలపై ఒక వివరణ కూడా ఇచ్చారు. ప్రభుత్వ ఫర్నిచర్ దుర్వినియోగం చేశారన్న విమర్శలను ఖండించారు. గుంటూరు వైసీపీ కార్యాలయంలో పని చేసే వ్యక్తే తన నివాసంలోని కంప్యూటర్ల చోరీకి పాల్పడినట్టు శివప్రసాదరావు చెప్పారు. తనపై కక్షతోనే అధికార పక్షం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇది ఒక దుర్మార్గమైన చర్య అని అన్నారు. శాసనసభలో ప్రతి వస్తువుకు ఒక లెక్క ఉంటుందని వివరించారు.