వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆస్పత్రిపాలయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన నెల్లూరు అపోలో ఆసుపత్రికి తరలించారు. గుండెలో రెండు వాల్స్ బ్లాక్ అయినట్లు నిర్ధారించారు వైద్యులు. మెరుగైన వైద్యం కోసం చెన్నైకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు డాక్టర్లు.
2019లో వైఎస్సార్సీపీ నుంచి ఉదయగిరి ఎమ్మెల్యేగా ఈయన విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయగా.. స్వల్ప తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. మొదట బూదవాడ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు. తొలిసారి 1999లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2004, 2009లలో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు.
మేకపాటికి గతంలో కూడా గుండెపోటు వచ్చింది. అప్పుడు బెంగుళూరులోని ఆస్ట్రా వైద్యశాలకు తరలించారు. మూడు రోజుల చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా మరోసారి గుండెపోటు గురవ్వడం అభిమానులు, కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు.
ఇటీవల గుండెపోటుతో మరణించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి చంద్రశేఖర్ రెడ్డి బాబాయ్ అవుతారు. ఈయన త్వరగా కోలుకోవాలని వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పూజలు చేస్తున్నారు.