నిర్మల్ జిల్లాలో డ్యాన్స్ చేస్తూ 19 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి.. జిమ్ చేస్తూ 24 ఏళ్ల కానిస్టేబుల్ మరణం.. షటిల్ ఆడుతూ 30 ఏళ్ల యువకుడి మృతి.. గత కొన్ని రోజులుగా మనం వింటున్న వార్తలే. వీటిన్నంటికీ కూడా ప్రధాన కారణం గుండెపోటు. ఎవరి నోట విన్న చనిపోయే వయస్సా వారిది అంటున్నారు. అంటే చిన్నవయసులో గుండెపోటు రాదు అనే కదా. కానీ గుండెపోటు వచ్చిన వారిలో ఎక్కువ శాతం మంది 40 సంవత్సరాల లోపు వారే.
అసలేందుకు చిన్న వయసులోనే..
30 సంవత్సరాల లోపు గుండెపోటు అంటే తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఈ గుండెపోటు సమస్యలు అనేవి ఎందుకు వస్తున్నాయంటే.. ముఖ్యంగా మారిన జీవనశైలే ఇలా చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడానికి ముఖ్య కారణంగా చెబుతున్నారు.ఊబకాయం బారిన పడిన వారిలోనే కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుందని అనుకుంటారు. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి బ్లడ్ క్లాట్లు ఏర్పడి, గుండెకు సరిగా రక్తప్రసరణ జరగక కార్డియాక్ అరెస్టు, గుండెపోటు వంటి సమస్యలు వస్తాయని చెబుతారు. నిజమే… కానీ ఎలాంటి కొలెస్ట్రాల్ సమస్యలు లేని వారిలోనూ బ్లడ్ క్లాట్లు ఏర్పడుతున్నాయి. వీటినే ‘ఇన్ స్టెంట్ బ్లడ్ క్లాట్లు’ అంటారు. దీనికి కారణం మానసిక, భావోద్వేగపరమైన తీవ్ర ఒత్తిళ్లే అని వివరిస్తున్నారు. ఈ ఒత్తిళ్ల వల్ల రక్తంలో క్లాట్లు లేదా గడ్డలు ఏర్పడి గుండెకు రక్తప్రసరణ సరిగా జరగదు. అలాంటి సమయంలో ఏ వయసులోనైనా హఠాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడిని ఎంత తగ్గించుకుంటే అంతగా ఈ ఇన్‌స్టెంట్ బ్లడ్ కాట్లు ఏర్పడే అవకాశం తగ్గిపోతుంది. విపరీతమైన ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోను అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇలాంటి రసాయన మార్పులు వల్ల రక్తంలో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం వంటివి చేసుకోవాలి.
మరో ప్రధాన సమస్య నిద్రలేమి!
ఎక్కువ మంది యువత రాత్రిపూట నిద్రను తగ్గించి, మొబైల్ కే తమ కళ్ళను అంకితం చేస్తున్నారు. దీనివల్ల హార్మోన్ల ఉత్పత్తుల్లో తేడాలు వస్తున్నాయి. మెదడుకు తగిన విశ్రాంతి లభించకపోవడంతో ఒత్తిడి కూడా పెరిగిపోతుంది. ఆ ఒత్తిడి నేరుగా గుండెపైన ప్రభావం చూపిస్తుంది. అందుకే చిన్న వయసులోనే గుండె సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుందని వైద్యులు వివరిస్తున్నారు. రాత్రిపూట పనిచేసే వారిలోనూ ఈ సమస్య ఎక్కువగానే ఉంది. రాత్రిపూట పని చేశాక ఉదయం పూట ఎంతగా నిద్ర పోయినా కూడా రాత్రి నిద్రతో సమానం కాదని చెబుతున్నారు. మన జీవన చక్రానికి తగినట్టు రాత్రివేళ నిద్రపోవడం, ఉదయం పూట పనులు చేసుకోవడం అన్నదే సరైన పద్ధతిని వివరిస్తున్నారు. లేకపోతే మనకు తెలియకుండానే శరీరంలో ఒత్తిడి పెరిగిపోయి ఇలాంటి గుండె జబ్బులకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
మారుతున్న ఆహారపు అలవాట్లు!
ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. జంక్ ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. ధూమపానం వంటివి మానేయాలి. అర్ధరాత్రి దాటాక ఆహారం తినడం వంటివి తగ్గించుకోవాలి. నాణ్యత లేని ఆహారంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. వ్యాయామం లేకపోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆ మేరకు చెడు కొలెస్ట్రాల్ అధికమైపోయి గుండెపై భారం పడుతుంది. రక్త పరీక్షల ద్వారా మాత్రమే కొలెస్ట్రాల్ స్థాయి నిర్ధారణ అవుతుంది. ఊబకాయుల్లోనే అధిక కొలెస్ట్రాల్ ఉంటుందనేది ఒక అపోహ మాత్రమే. సన్నగా ఉన్నవారిలోనూ అధిక కొలెస్ట్రాల్ ఉండవచ్చు. కాబట్టి, తరచూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఆహారంలో మార్పుచేర్పులు కూడా అవసరమే.
గత పదేళ్లలో ఆహారపు అలవాట్లు చాలా మారి పోయాయి. తాజా కూరగాయలు, పండ్లు తీసుకొనే అలవాటు తగ్గిపోయింది. డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, బేకరీ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఆరగించడం ఫ్యాషన్‌గా మారింది. దీనివల్ల బరువు పెరుగుతున్నది. కొలెస్ట్రాల్, షుగర్ స్థాయులూ హద్దుమీరుతున్నాయి. అధిక రక్తపోటు, మధుమేహం, చెడు కొలెస్ట్రాల్‌కు ప్రధాన కారణం.. బరువు పెరగడమే. ఒక వ్యక్తి సాధారణ స్థాయి కంటే ఎక్కువ బరువు ఉన్నాడంటే దాన్ని బీపీ, షుగర్‌లకు ప్రారంభ దశగా భావించాలి. ఊబకాయం హఠాత్తుగా రాదు. బరువు క్రమంగానే పెరుగుతుంది. తొలి దశలోనే నియంత్రించడం ఉత్తమం.
తగ్గిన శారీరక శ్రమ!
శారీరక శ్రమ తగ్గిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల చాలామంది గంటల తరబడి కదలకుండా పనిచేస్తున్నారు. సమయాభావం సాకుతో హెల్త్ చెకప్‌లకు దూరం అవుతున్నారు. దీంతో యువతలో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగిపోతున్నాయి. అంతిమంగా గుండెపోటుకు దారితీస్తున్నాయి.సాధారణంగా, పుట్టిన ఏడాది కాలం నుంచీ ప్రతి వ్యక్తిలో కొంత మేర రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉండటం సహజం. ఇది వయసుతో పాటు అతి నెమ్మదిగా పెరుగుతుంది. అయితే, ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవన శైలి ఫలితంగా ఈ బ్లాకేజ్ ఒక్కసారిగా తీవ్రం అవుతుంది. అంతులేని శారీరక శ్రమ, ఒత్తిడి వల్ల ప్రాణాంతకంగానూ పరిణమించవచ్చు.
నిత్యం వ్యాయామం చేయకుండా, ఒకేసారి మితిమీరిన కసరత్తుకు సిద్ధపడితే గుండె మీద భారం పడుతుంది. అది గుండెపోటుకు దారితీసే ఆస్కారం ఉంది.. జిమ్ వర్కవుట్స్‌తో హృదయ స్పందన అకస్మాత్తుగా పెరిగిపోతుంది. ఫలితంగా రక్తనాళాలు నిమిషాల్లోనే 40 నుంచి 100 శాతం మేర బ్లాక్ అవుతాయి. దీంతో, గుండెపోటు వస్తుంది.
గతంలో కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉండేది. కరోనా కాలం నుంచీ ప్రతి ఇల్లూ వర్క్ ఫ్రమ్ హోమ్‌తో బిజీబిజీగా కనిపిస్తున్నది. మినీ ఆఫీసుగా మారుతున్నది. ఇంట్లో నుంచే పనిచేస్తుండటంతో సేదతీరే అవకాశమూ లేకుండా పోయింది. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నది యువత. కుటుంబ, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ అభద్రత, ఆలూమగల బంధాలకు బీటలు.. తదితర కారణాల వల్ల మానసిక రుగ్మతలు అధికం అవుతున్నాయి. ఈ ‘సైకాలజికల్ స్ట్రెస్’ కూడా గుండెపోటుకు ఓ కారణమే.యువత డ్రగ్స్‌కు బానిస అవుతున్నది. గుండెపోటుకు గురవుతున్న నలభై ఏండ్లలోపు వారిలో మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నవారి సంఖ్య తక్కువేం కాదు. మత్తు పదార్థాల వల్ల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి. గుండెకు రక్త సరఫరా మందగించి గుండెపోటుకు దారి తీస్తుంది.
రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతినడం వల్ల కూడా గుండెపోటు వస్తుంది. కాకపోతే, రక్తనాళాలు చితికిపోవడం లేదా పగిలిపోవడం చాలా అరుదైన పరిణామం. దీనికి కచ్చితమైన కారణాలు చెప్పలేం. స్త్రీ, పురుషులు ఇద్దరికీ ఈ ప్రమాదం పొంచి ఉంది.
తగ్గించుకోవాలంటే..
ధూమపానం మానేయాలి. తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. తీపి, ఉప్పు, నెయ్యి తగ్గించాలి. రెడ్ మీట్ (బీఫ్, పోర్క్, మటన్) తగ్గించాలి. వనస్పతి నూనెతో చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ప్రాసెస్డ్, ప్యాకేజ్ ఫుడ్స్ తినకూడదు.బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి.రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్, జాగింగ్ లేదా స్విమ్మింగ్ చేయాలి. వారంలో ఐదు రోజులు ఏదో ఓ వ్యాయామం తప్పనిసరి. మధుమేహం, కొలెస్ట్రాల్ నియంత్రణలో పెట్టుకోవాలి.ఎప్పటికప్పుడు బీపీ పరీక్షించుకోవాలి.
ఆకస్మిక వ్యాయామాలు, మితిమీరిన శారీరక శ్రమ వద్దే వద్దు.యోగా, ధ్యానం దినచర్యలో భాగం చేసుకోవాలి.