తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రతిదానిలో ఉత్తమమైన వాటిని అందించడానికి గొప్ప త్యాగాలు చేస్తారు. ఇటీవల ఓ ఐఏఎస్ అధికారి షేర్ చేసిన వీడియో అందుకు పూర్తి అనుగుణంగా ఉంటోంది. ఓ వికలాంగుడైన వ్యక్తి స్కూల్ యూనిఫాంలో ఉన్న ఇద్దరు పిల్లలను ఎక్కించుకొని ట్రైసైకిల్ ను చేతితో తొక్కుతూ వెళ్తున్నట్టు ఆ వీడియోలో కనిపించింది.
సోనాల్ గోయెల్ అనే ఐఏఎస్ అధికారి.. ఈ నెల 23న రోడ్డుపై వెళ్తున్నారు. తాను వెళ్లే మార్గంలో ఓ ఆసక్తికర ఘటన చూశారు. ఓ వికలాంగుడైన తండ్రి తన ఇద్దరు పిల్లలను ట్రైసైకిల్ పై కూర్చోపెట్టుకొని చేతితో నడుపుతూ స్కూల్ తీసుకెళ్తుండా చూశారు. అది చూసిన ఆ అధికారి వీడియో తీసి ట్విట్టర్‌లో షేర్ చేశారు. దానికి కేవలం “తండ్రి” అని ట్యాగ్ చేస్తూ రాశారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ వీడియోలో స్కూల్ యూనిఫాంలో ఉన్న బాలిక సైకిల్ కు వెనక భాగంలో కూర్చొని కాళ్లతో ముందుకు నెట్టుతుంటే.. బాలుడు మాత్రం తండ్రి ముందు కూర్చొని సైకిల్ డైరెక్షన్ లు చెప్తున్నట్టు కనిపించింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కొందరు సానుకూలంగా స్పందిస్తే.. ఇంకొందరు ప్రతికూలంగా స్పందిస్తున్నారు.
“ఈ వీడియో చాలా అసాధారణంగా, మనసును హత్తుకునే విధంగా అనిపిస్తోంది. వాస్తవానికి, క్లిప్ లో కనిపిస్తున్న వారిది చాలా సాధారణమైన జీవితం. ఈ వీడియో ఆ తండ్రి గొప్పతనాన్ని చూపించే విధంగా కనిపిస్తోంది”.. అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. “ఇది చాలా హృదయ విదారకంగా ఉంది. వారి అనుమతి లేకుండా వీడియోను రికార్డ్ చేసి ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేస్తారా..? ఇది వైరల్ అవుతుంది.. వారు ఈ వీడియోను చూసి ఏం అనుకుంటారో అని తెలియదా..? అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.