ఆఫ్ఘానిస్తాన్ లో తాజాగా జరుగుతున్న పరిస్థితులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆదివారం తాలిబాన్లు రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం లొంగిపోవడంతో అధ్యక్షుడు అష్రఫ్ ఘని ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయారు. ఈ రోజు కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న వందలాది మంది చివరి విమానాలలో బయలుదేరారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు హృదయవిదాకంగా ఉన్నాయి.
తాలిబాన్లు కాబూల్‌లోకి ప్రవేశించి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని పడగొట్టారు. దీంతో ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి దేశం విడిచి వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ నెలకొన్న పరిస్థితులకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ లో సంచలనంగా మారాయి. ప్రజలు విమానాల ద్వారా దేశాన్ని దాటడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. విమానాశ్రయంలో పార్క్ చేసిన ఎయిర్‌క్రాఫ్ట్‌లోకి ఎక్కడానికి వందలాది మంది ప్రజల మధ్య తోపులాట జరుగుతోంది. ఒక వీడియోలో కాబూల్ విమానాశ్రయం నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానం ఎక్కడానికి ప్రజలు ఒకరినొకరు తోసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కువ మంది ప్రజలు ఉండడంతో విమానాశ్రయంలో తొక్కిసలాట లాంటి పరిస్థితి కన్పిస్తోంది.
అలాంటి మరో వీడియో కూడా మనసుని కదిలించి వేస్తోంది. సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతున్న ఓ వీడియోలో విమానము నుంచి జారి పడిపోతున్న వ్యక్తులను మనం చూడొచ్చు. ఇది కాబూల్ విమానాశ్రయం నుండి బయలుదేరినప్పుడు జరిగిన ఘటన. ఇంకో దిగ్భ్రాంతికర వీడియోలో దేశం విడిచి వెళ్లిపోవడానికి తీవ్రంగా ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు విమానం చక్రానికి అతుక్కుపోయారు. అయితే ఆ తరువాత వారు మరణించారు. ఇక మరొక వీడియోలో కిలోమీటర్లమేర ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.