ఆంధ్రప్రదేశ్ కి రెండు రోజుల్లో తుపాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రానున్న రెండు రోజుల్లో అనగా ఈ నెల 18న ఉత్తర అండమాన్ సమీపంలో ఏర్పడే ఉపరితల ఆవర్తనంతో ముప్పు మొదలయ్యే అవకాశముందని వెదర్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. దీనికి తోడు అక్టోబర్ 20వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తుందని అధికారులు అంచనాలు వేశారు. దీంతో ఇది తుపాన్ నుంచి పెను తుపానుగా మారే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం తుపాన్ గా మారితే సిత్రాంగ్ అనే పేరుతో పిలవనున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
సిత్రాంగ్ సూపర్ సైక్లోన్ గా మారితే దీని ప్రభావం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతోపాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై అధికంగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాన్ కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు.
కొన్ని రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వాగులు, చెరువులు పూర్తి స్థాయిలో నిండాయి. దీనికి సూపర్ సైక్లోన్ తోడైతే జలవిలయం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది.