హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు కలవర పెడుతున్నాయి. సికింద్రాబాద్ డెక్కన్ మాల్ ఘటన మారువక మరో అగ్ని ప్రమాదం నగరంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ లో ప్రధాన ప్రాంతమైన పురానాపూల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కూలర్ల గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాంలో ఎక్కువ మెుత్తంలో ప్లాస్టిక్ సామాగ్రి ఉండటంతో.. దట్టమైన పొగలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, 6 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. గోడౌన్ లోపల ఎవరైనా కార్మికులు చిక్కుకుని ఉన్నారా? అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
గోదాం రెసిడెన్షియల్ ఏరియాలో ఉండటంతో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల ప్రజలంతా భయంతో వణికిపోయారు. ఇండ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేయడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
మంటల ధాటికి గోదాం పైకప్పు కూలిపోయింది. అగ్నికీలలు ఎక్కువగా వ్యాపించడంతో.. గోదాం పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని పోలీసులు ఖాళీ చేయించారు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.