– కాళేశ్వరం పుష్కరఘాట్లు మునక
– రోడ్లపైకి చేరుతున్న వరద
– జలదిగ్బంధంలో భైంసా
– ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువ ప్రాంతాలు మునక
– నిండుకుండలా హుస్సేన్ సాగర్
– మూసీకి నీటి విడుదల
భారీ వర్షాలతో గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. కాళేశ్వరం వద్ద పుష్కరఘాట్లు మునిగిపోయాయి. రోడ్లపైకి వరదనీరు చేరింది. కడెం ప్రాజెక్టులోకి 7 లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో ఔట్ ఫ్లో 3 లక్షలు వదులుతున్నారు. భారీగా వరద నీరు రావడంతో ప్రాజెక్ట్ కు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. నీరు డ్యామ్ మీది నుండి దూకుతోంది. ఏ క్షణంలోనైనా కట్ట తెగిపోయే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. పండవపూర్, అంబర్పేట్, దేవునిగూడెం, భూత్కూర్, రాంపూర్, మున్యాల్, గోడిసిరియల్ గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
భైంసాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పడుతున్నాయి. ముధోల్ తాలూకా వ్యాప్తంగా పడుతున్న వర్షాలతో పలు రోడ్డు మార్గాలు దెబ్బతినగా, రాకపోకలు నిలిచిపోయాయి. గడ్డెన్నవాగు ప్రాజెక్టు వరద పోటెత్తుతోంది. మహారాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుకు నాలుగు గేట్లను ఎత్తి 55 వేల క్యూసెక్కుల వరద నీటిని సుద్దవాగులోకి నీటిని వదిలిపెట్టారు. భైంసా పట్టణ పరిధిలోని పరివాహక ప్రాంతాలన్నీంటిని వరద నీరు ముంచెత్తింది.
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హాజిపుర్ మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు 47 గేట్లు ఎత్తడంతో తొమ్మిది లక్షల క్యూసెక్కల నీరు దిగువకు వెళ్తోంది. ఈ క్రమంలో గోదావరి ఒడ్డున నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రం పూర్తిగా నీట మునిగింది.
ఇటు మూసీ ఆరు క్రస్ట్ గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 3,878 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,143 క్యూసెక్కులుగా ఉంది. మూసీ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 638.30 అడుగులుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు. మరోవైపు హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ ఫుల్ అయింది. నిండుకుండలా కనిపిస్తోంది. నాలాల నుంచి హుస్సేన్ సాగర్ కు వరద వస్తోంది. దీంతో మూసీలోకి నీరు విడుదల చేశారు అధికారులు.