ముంబైకి, వర్షాలకి విడదీయరాని అనుబంధం ఉన్నట్టుగా ఉంది. ఎక్కడ ఉరుము ఉరిమినా.. ముంబైలో జల్లులు పడకుండా ఉండవేమో. ఆమధ్య తుఫాన్ ప్రభావంతో అతలాకుతలమైన నగరం… ఇప్పుడు భారీ వర్షాలకు మరోసారి వణికిపోతోంది.
ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండడంతో ముంబైలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవేపై భారీగా నీళ్లు నిలిచిపోయాయి.
సియాన్ రైల్వే స్టేషన్ లో వరద నీరు ట్రాక్ మీదకు చేరింది. కొన్ని రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం ఎత్తు వరకు వరద నీరు వచ్చింది. అర్ధరాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది.
అందేరీ, బోరివాలి ప్రాంతాల్లో జనం నిద్రపోకుండా ఇళ్లలోకి వచ్చిన నీళ్లను ఎత్తిపోస్తూనే ఉన్నారు.
భారీ వర్షాల కారణంగా ముంబై విక్రోలి ప్రాంతంలో భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద మరికొంత మంది ఉన్నట్టు భావిస్తున్నారు.