గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ సీపీఐ పోరుబాట పట్టింది. రాజ్ భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రాజ్ భవన్ రూట్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
సీపీఐ నేతలు పెద్దఎత్తున ఖైరతాబాద్ చేరుకుని అక్కడి నుంచి రాజ్ భవన్ ను ముట్టడించేందుకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు సీపీఐ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకానొక సమయంలో తోపులాట కూడా చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉండడంతో.. సీపీఐ నేతలు కూనంనేని, చాడాను పోలీసులు అరెస్ట్ చేశారు.
గవర్నర్ వ్యవస్థతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని సీపీఐ నేతలు మండిపడుతున్నారు. అందుకే ఈ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బిల్లులను ఎంత కాలం నిలుపుదల చేయాలో రాజ్యాంగంలో నిర్ధిష్టమైన గడువు లేకపోవడంతో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. రాజ్ భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
కూనంనేని, చాడల అరె స్ట్‌పై సీపీఐ కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్నారు. గవర్నర్ వ్యవస్థతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని, అందుకే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కూనంనేని. ప్రస్తుత రాష్ట్ర గవర్నర్ తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన విషయాన్ని గుర్తుచేశారు.
కవితపై కేసు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని.. అసలు లిక్కర్ కేసు ఏంటో అర్థం కావడం లేదన్నారు కూనంనేని. టీడీపీలో ఉన్నప్పుడు సుజనా చౌదరి, సీఎం రమేష్ లపై దాడులు చేశారని.. వాళ్ళు బీజేపీలో చేరగానే పునీతులు అయ్యారని అన్నారు. షర్మిలకు మోడీ ఫోన్ చేసి పలకరించే సమయం ఉంది కానీ… బీజేపీ రాష్ట్రాల్లో మహిళలపై దాడులు, హత్యలు చేసిన బాధితులను పరామర్శించే సమయం లేదా? అని అని ప్రశ్నించారు.