కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కార్పొరేట్ వరాలతో మార్కెట్లు భారీ లాభాల దిశగా పయనించాయి. సీతమ్మ స్టేట్‌మెంట్ ఇచ్చిన కాసేపటికే కొనుగోళ్లు పుంజుకున్నాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.2.11 లక్షల కోట్లు పెరిగింది.
ముంబయి: దలాల్ స్ట్రీట్ ఇవాళ ఉత్సాహంతో ఉరకలేసింది. గత దశాబ్ద కాలంలో ఏనాడూ లేని విధంగా దూసుకుపోయింది. ఒకే ఒక్క రోజులో అతి భారీ లాభాలు దక్కాయి. మార్కెట్లో రికార్డులు నమోదయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్పొరేట్ ప్రపంచానికి ప్రకటించిన వరాలతో సెన్సెక్స్ ఒక దశలో 2200 పాయింట్ల పైగా ఎగిసింది. నిఫ్టీ 650 పాయింట్లకు పైన లాభపడింది. దీంతో కీలక సూచీలు కీలక మద్దతు స్థాయిలకు ఎగువకు చేరాయి. ఆఖరి అర్ధగంటలో లాభాల స్వీకరణతో చివరికి సెన్సెక్స్ 1921 పాయింట్ల లాభంతో 38,014 దగ్గర, నిఫ్టీ 569 పాయింట్లు జంప్ చేసి 11,274 దగ్గర స్థిరపడ్డాయి. బ్యాంకు నిఫ్టీ కూడా 7 శాతం రికార్డు లాభాలను సాధించింది. దాదాపు అన్ని రంగాలు లాభాల దూకుడు ప్రదర్శించాయి.
ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో, మెటల్, క్యాపిట్, కన్సూమర్ గూడ్స్ రంగాలు 10-6 శాతం దూసుకెళ్లాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్, హీరో మోటో, ఇండస్‌ఇండ్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్, బ్రిటానియా, టైటన్, ఎంఅండ్‌ఎం టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. జీ ఎంటర్‌ప్రైజెస్, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా స్వల్పంగా నష్టపోయాయి. దీంతో చరిత్రలో తొలిసారి లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కేపిటలైజేషన్ రూ. 7 లక్షల కోట్లకు చేరింది.