తెలంగాణలో గత రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల చెరువులకు గండ్లు పడగా, వరంగల్ తో పాటు సిరిసిల్ల పట్టణాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి. ఎటు చూసినా వరద నీరే భారీగా ప్రవహిస్తుంది. దీంతో సిరిసిల్ల, నిజామాబాద్ లో విద్యా సంస్థలకు లోకల్ హాలిడే ప్రకటించారు.
అయితే, ఈ వర్షాలు మరో రెండ్రోజులుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా పెద్దపల్లి, భూపాలపల్లి జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించింది. బుధవారం కూడా నిజామాబాద్, కొమురం భీం,అదిలాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తన ప్రభావంతో వాయవ్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడింది. దీంతో వర్షాలు పడుతున్నాయి.