– హైదరాబాద్ లో భారీ వర్షం
– బయటకు రావొద్దని అధికారుల హెచ్చరిక
– నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్
– స్కూల్స్ బంద్ తప్పదా?
మరోసారి భారీ వర్షాలు హైదరాబాద్ వాసులను ఇబ్బంది పెడుతున్నాయి. శుక్రవారం ఉదయం తగులుకున్న వరుణుడు వదలనే లేదు. ఒక్కోసారి భారీ వర్షం.. ఇంకోసారి చిన్నపాటి తుప్పరగా కురుస్తూనే ఉన్నాడు. భారీ వర్షాలతో పలుచోట్ల వరద నీరు రహదారులపైకి చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
లోతట్టు ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. రోడ్లపై నీళ్ళు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించిపోయింది. మరో రెండు రోజుల పాటు తేలిక నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకపూల్, నారాయణగూడ, హిమాయత్‌నగర్ ప్రాంతాలలో ఎడతెరపిలేని వర్షంతో వరద నీరు రహదారులపైకి చేరింది. తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో షియర్ జోన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వానల కారణంగా స్కూల్స్ ఉంటాయా? లేదా? అనేది హాట్ టాపిక్ గా మారింది.