వరుణుడు కరుణించాడు రెండు రోజుల నుంచి వానలు తగ్గాయని అనుకునేంతలోపే.. మళ్లీ నేను వెళ్లలేదు అంటూ వచ్చేశాడు వరుణుడు. రెండు తెలుగు రాష్ట్రాలపై మరోసారి వాన దేవుడు తన విశ్వరూపాన్ని చూపించనున్నాడు.
ఈరోజు ఉదయాన్నే నగరాన్ని వర్షం ముంచెత్తింది. రానున్న రెండు రోజుల్లో తెలంగాణ,కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోందని వెల్లడించారు.
ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారి 7 గంటల నుంచి భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, టోలిచౌకి,మణికొండ, గచ్చిబౌలి, లింగంపల్లి, అంబర్ పేట్, రామంతాపూర్, ఉప్పల్, సికింద్రాబాద్,బోయిన్‌పల్లి, బేగంపేట్, కొండాపూర్, కొత్తగూడ, గచ్చిబౌలి, మాదాపూర్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్‌బాగ్, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
నేడు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌వాతావరణ శాఖ పేర్కొంది. నాగర్‌కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.