ఢిల్లీలో 45 ఏళ్లలో ఎన్నడూ చూడని వానలు పడుతున్నాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కుండపోత వర్షం పడుతూనే ఉంది. వర్షాకాలంలో ఈ స్థాయిలో వానలు పడి ఎన్నో ఏళ్లయిందని చెబుతున్నారు వాతావరణశాఖ అధికారులు. ఆఖరికి ఎయిర్ పోర్ట్ లోపలికి కూడా భారీగా వరదనీరు చేరింది.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వరద నీరు ముంచెత్తింది. రన్ వే, టెర్మినల్ ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో విమానాలను దారి మళ్లించారు. ఎయిర్ పోర్టులో నిలిచిపోయిన నీటిని సిబ్బంది సాయంతో తొలగిస్తున్నారు అధికారులు.
ఢిల్లీలో ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. ఇంకో రెండు రోజులు వానలు ఉంటాయని తెలిపింది వాతావరణశాఖ. దీంతో ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. దేశ రాజధానిలో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి.
రోడ్లన్నీ కాలువల్ని తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువుల్లా మారిపోయాయి. ముఖ్యంగా అండర్ పాస్ వంతెనల దగ్గర నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.