హైదరాబాద్ నగరంలో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ పరిధిలో సుమారు ఒక గంటపాటు భారీ వర్షం కురిసింది. వాన తీవ్రతకు పలు ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం ఏర్పడగా రోడ్లపై నీరు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
నైరుతి రుతుపవనాల కారణంగా సికింద్రాబాద్,మేడ్చల్ జిల్లా పరిధిలో భారీ వర్షం కురిసింది. మేడ్చల్ జిల్లాలోని బాలానగర్, కుత్బుల్లాపూర్,చింతల్,జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, కొంపల్లి, సుచిత్ర, దుండిగల్, కుషాయిగూడ, దమ్మాయిగూడ, చర్లపల్లిలో వర్షం పడింది. మల్కాజిగిరి పరిసరాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో నాలలు పొంగి రోడ్లన్నీ జలమయమయ్యాయి, పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
సుమారు గంటకు పైగా కురిసిన భారీవర్షంతో నాలాలు నిండిపోయి నీరంతా రహదారులపైకి చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. శేరిలింగంపల్లి, అల్వాల్, నాగారం, మల్కాజిగిరిలోనూ జోరు వాన కురిసింది. కాప్రా, కుషాయిగూడ, తార్నాక, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌లో భారీ వర్షం పడింది.
రాష్ట్రంలో అక్కడక్కడ ఇవాళ, రేపు భారీ వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు తూర్పు పడమర ద్రోణి ఉత్తర మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్‌గఢ్ మీదుగా దక్షిణ ఒడిశా తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టానికి సుమారు 900మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం వివరించింది.
జీహెచ్‌ఎంసీ హెచ్చరిక.. అవసరమైతే తప్ప బయటికిరావొద్దు
అయితే.. మచ్చబొల్లారంలోని అంజనీపూరి కాలనీలో వరద నీటితో రహదారి నిండిపోయింది. అదే సమయంలో.. మంజుల అనే మహిళ అటుగా నడుచుకుంటూ వెళ్లింది. చాలా జాగ్రత్తగా.. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తోంది. నీటితో పూర్తిగా నిండిపోయిన రహదారిపై ఎక్కడ ఏముందో కనిపించకపోవటంతో ఆ మహిళ ప్రమాదవశాత్తు ఓ గుంతలో పడిపోయింది. అది ఇంటి నిర్మాణం కోసం తీసిన గోతి కావటంతో.. మహిళ నీటిలో పూర్తిగా మునిగిపోయింది. అదే సమయంలో అక్కడున్న స్థానికులు.. మహిళ పడిపోవటాన్ని గ్రహించి వెంటనే ఆమెను పైకి లేపి రక్షించారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పినట్టయింది. ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.
Advertisements