హైదరాబాద్ నగరాన్ని వర్షం విడిచిపెట్టడం లేదు. మూడు రోజుల నుంచి నగర వాసులు వానలో తడిసి ముద్దవుతున్నారు. నిన్న కాస్త ఎండగా అనిపించిన సాయంత్రానికి నేను ఎక్కడికి వెళ్లలేదు అంటూ వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు.
నిన్న అర్ధరాత్రి నుంచి భాగ్యనగరంలో వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో నాలాలు పొంగుతున్నాయి. ఉదయం ఉద్యోగాలకు వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో బాలానగర్, మూసాపేట్, అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, ఎర్రగడ్డ, యూసఫ్‌గూడ, జూబ్లీ చెక్‌పోస్ట్, కూకట్పల్లి, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, కోఠీ, ఆబిడ్స్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్ మసబ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో వర్షం భారీగా పడుతోంది.
వాన వల్ల రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 17 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
శనివారం ఆదిలాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.