హైదరాబాద్ నగరంలో అర్థరాత్రి నుంచి వరుణుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వానకు పలు కాలనీలు నీట మునిగాయి.
భారీ వర్షానికి నాంపల్లి లోని పలు కాలనీలతో పాటు, గాంధీభవన్ వెనుక ఉన్న పటేల్‌నగర్‌లో ఓ అపార్ట్మెంట్ సెల్లార్ పూర్తిగా నీటితో నిండిపోయింది. పార్కింగ్‌లో నిలిపి ఉంచిన వాహనాలు నీట మునిగాయి. ఇంటి నుంచి బయటకి వెళ్లలేని పరిస్థితి తలెత్తడంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బయట నుంచి వరద నీరు వచ్చి తమ అపార్ట్మెంట్లోకి చేరుతుందని.. భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్, స్థానిక భాజపా కార్పొరేటర్, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో తమ అపార్ట్మెంట్లోకి నీరు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికీ వెళ్లలేని పరిస్థితి తలెత్తిందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
మరోవైపు భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతుండగా..లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
రాత్రి కురిసిన భారీవర్షానికి…వరద నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చేరింది. చాలా చోట్ల రోడ్లపై మోకాల్లోతు నీరు ప్రవహించింది. రాత్రి భారీ వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయంభయంగా గడిపారు. కోఠిలో ఓ బైక్ వరద నీటిలో కొట్టుకుపోయింది. మలక్ పేట్ బ్రిడ్జ్ దగ్గర నడుములోతు వరకు నీరు ప్రవహించటంతో చాలా సేపు రాకపోకలు స్తంభించాయి. నాగోల్ డివిజన్ అయ్యప్ప నగర్ కాలనీలో ఇళ్లలోకి వరదనీరు చేరింది.
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరు వానలు పడుతున్నాయి. వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. కోట్పల్లి ప్రాజెక్టు అలుగు పారుతుండడంతో ధారూర్, నాగసమందర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దాచారం వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పై నుంచి నీరు పారుతుండగా తాండూరు–హైదరాబాద్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు వాగులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆనంద్..అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
గండిపేట జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాలైన వికారాబాద్, శంకర్‌పల్లిలో ఏకధాటిగా కురిసిన వర్షానికి గండిపేట జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో మూడు ఫీట్ల మేరా 6 క్రస్ట్ గేట్లు ఎత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ నది కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
కాగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తర్వాతి రెండ్రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది