తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుండడంతో కాలనీలన్ని జలమయం అయ్యాయి. నగరంలోని పెద్ద చెరువు అలుగు పారడంతో చాలా ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీళ్లు చేరుకున్నాయి.
దీంతో రాత్రి నుంచి స్థానికులంతా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రం అంతా ఎంతో ఘనంగా జరుపుకుంటున్న దసరా పర్వదిన వేళ తమ పరిస్థితి మాత్రం ఇలా ఉంది అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
రెండు ఏళ్ళ నుంచి వర్షాలు పడటం.. పెద్ద చెరువు నిండిపోయి అలుగు పారడటంతో ఇళ్లలోకి నీరు చేరుతోంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు వచ్చి చూసి వెళ్తున్నారు.
అంతేకానీ తమకు ఎటువంటి పరిష్కారం చూపటం లేదంటూ లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు దిగారు. రహదారిపై కూర్చొని నినాదాలు చేస్తూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.