గులాబ్ తుపాను ప్రభావం ఏపీలోనే కాదు తెలంగాణపైనా గట్టిగానే ఉంది. ఆదివారం రాత్రి నుంచి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వాన పడుతోంది. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి, నిజామాబాద్, సంగారెడ్డిలో ఉదయం నుంచి భారీ వర్షం పడుతూనే ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతోంది. అంబర్‌పేట, కాచిగూడ, గోల్నాక, నల్లకుంట, జీడిమెట్ల, కొంపల్లి, కుత్బుల్లాపూర్, హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, రామంతాపూర్, పీర్జాదిగూడ, బోడుప్పల్, మేడిపల్లి, ఆల్విన్ కాలనీ, బాచుపల్లి, ప్రగతినగర్, నిజాంపేట్ లో వర్షం కురుస్తూనే ఉంది.
ఇంకో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. జీహెచ్‌ఎంసీ హై అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూంచించింది.
వర్షాకాలంలో ఈ సమయానికి తెలంగాణలో మామూలు వర్షపాతం 681 మిల్లీమీటర్లు. కానీ.. ఇప్పటికే 34శాతం అధికంగా 911 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇక హైదరాబాద్ లో అయితే సాధారణం 549 మిల్లీమీటర్లు కాగా.. 21శాతం అధికంగా 664 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పుడు తుపాను ఎఫెక్ట్ తో కుంభవృష్టి వానలు పడుతున్నాయి. దీంతో ఈ రికార్డు కూడా చెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.