భాగ్యనగరాన్ని అర్ధరాత్రి భారీ వర్షం ముంచెత్తింది. మూడు గంటలకు పైగా నగరంలో బీభత్సం సృష్టించింది. అనేక ప్రాంతాల్లో మోకాలి లోతున నీరు చేరగా.. అపార్ట్ మెంట్ల సెల్లార్లలో కార్లు, బైకులు సగం వరకు మునిగాయి. ఎర్రగడ్డ-మెట్రో స్టేషన్ కింద భారీగా వరద నీరు చేరింది. ఎర్రగడ్డ-కూకట్ పల్లి మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
బోరబండ, రసూల్ పుర వంటి పలు చోట్ల ఇళ్లలో వరద నీరు చేరగా.. ఆటోలు, బైకులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబిలీ హిల్స్, అమీర్ పేట, బేగం పేట, రాజేంద్ర నగర్, బండ్లగూడ, షాద్ నగర్.. ఇలా అనేక చోట్ల వర్షం దంచి కొట్టింది. రోడ్లపై ట్రాఫిక్ దాదాపు స్తంభించిపోయింది.
ప్రజలు, వాహనదారుల ఇబ్బందులు ఇన్నీఅన్నీ కావు. మోకాలి లోతు నీటిలోనే ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కూకట్ పల్లిలో అత్యధికంగా 10.4 సెం.మీ. వర్షపాతం నమోదయింది. ఇంకా కుత్బుల్లా పూర్ లో 9.2, మోండా మార్కెట్ లో 6.7, తిరుమలగిరిలో 9, రామచంద్రాపురం లో 8.2, మూసాపేట 8, ఫతేనగర్ 7.3, పటాన్ చెరులో 7.2, బాలానగర్ లో 6.8 సెం.మీ. వర్షపాతం నమోదయింది.
జంట జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఉస్మాన్ సాగర్ ఇన్ ఫ్లో 900 క్యూసెక్కులు కాగా .. అధికారులు 4 గేట్లు ఎత్తి 952 క్యూసెక్కుల ప్రవాహాన్ని మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్ సాగర్ ఇన్ ఫ్లో 1200 క్యూసెక్కులు కాగా రెండు గేట్లు ఎత్తి 1373 క్యూసెక్కులను మూసీలోకి వదులుతున్నారు. మరో మూడు రోజులు హైదరాబాద్ నగరానికి వర్షాల బెడద తప్పదని వాతావరణ శాఖ వెల్లడించింది.