హైదరాబాద్ నగర వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. జోరు వానతో రోడ్ల మీదకి నీళ్లు చేరాయి. దీంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరుసగా పడుతున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో సోమవారం, మంగళవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇక ఉప్పల్, తార్నాక, రాజేంద్ర నగర్, పీర్జాదిగూడ, అత్తాపూర్, బండ్ల గూడ, కిస్మత్ పూర్, హిమాయత్ సాగర్, మణికొండ, బంజారాహిల్స్, అమీర్ పేట, కూకట్ పల్లి, కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, అబిడ్స్, ట్రూప్ బజార్, నాంపల్లి, బషీర్బాగ్, లక్డీకాపూల్, నారాయణగూడ, హైదర్గూడ, ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి వరదనీరు రోడ్డు పైకి రావాలంటే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాగల 24 గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీగా వానలు పడతాయని వెల్లడించింది వెదర్ డిపార్ట్ మెంట్. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని హెచ్చరించింది.
రాగల 24గంటల్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి,.. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 7 సెంమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వెదర్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. మంగళవారం కూడా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉదని వాతావరణ కేంద్రం పేర్కొంది.