నిన్న మొన్నటి వరకు ఎండలు దంచి కొట్టినప్పటికీ.. మేఘాలు ఒక్క సారిగా చల్లబడ్డాయి. అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రతలతో దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సోమవారం ఉదయం ఢిల్లీలో భారీ వర్షం కురియడంతో.. ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం లభించిందని ఊపిరి పీల్చుకున్నారు రాజధాని ప్రజలు.
సోమవారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో 11 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ సమయంలో కేవలం 29 డిగ్రీల నుంచి 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదైనట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రెండు గంటల పాటు ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో భారీగా కురిసిన వర్షానికి ఢిల్లీ తడిసి ముద్దైంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. బలమైన గాలులు వీచడం వల్ల పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి నేలకొరిగాయి.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ క్రమంలో ప్రయాణికులు తమ సంబంధిత ఎయిర్‌లైన్‌ను సంప్రందించాలని ఎయిర్‌పోర్టు వర్గాలు సూచించాయి.