హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్న తీరంగా వర్షం పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భారీగా వర్షపాతం నమోదవుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్ల మీదకి, ఇళ్లల్లోకి నీళ్లు వచ్చి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతోంది. వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న వేళ జీహెచ్ఎంసీ సిబ్బంది తీరుపై విమర్శలు వస్తన్నాయి. రోడ్ల మీద వర్షపు నీళ్లు నిలిచి ప్రజలు కష్టాలు పడుతుంటే జీహెచ్ఎంసీ సిబ్బంది ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
ఇక ఉప్పల్, తార్నాక, రాజేంద్ర నగర్, పీర్జాదిగూడ, అత్తాపూర్, బండ్ల గూడ, కిస్మత్ పూర్, హిమాయత్ సాగర్, మణికొండ, బంజారాహిల్స్, అమీర్ పేట, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వర్షం కురిసిన ప్రతిసారీ ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయని నగర ప్రజలు వాపోతున్నారు. వరదనీటిలో ఇబ్బందులు పడుతున్నా స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు
కాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో వర్ష పాతం ఎక్కువగా నమోదైంది. గచ్చిచౌలిలో అత్యధికంగా 4.5 సెంటీ మీటర్లు, కుత్భుల్లాపూర్ లో 1.2 సెంటీ మీటర్లు, సరూర్ నగర్ లో 3.2 సెంటీమీటర్లు, ఎల్.బీ.నగర్ లో 2.8 సెంటీమీటర్లు, చర్లపల్లి లో 4.2 సెంటీమీటర్లు, ఏఎస్ రావు నగర్ లో 3.9 సెంటీమీటర్లు, ఆర్సిపురంలో 3.8 సెంటీమీటర్లు, పటాన్ చెరులో 3.1 సెంటీమీటర్లు, హఫీజ్ పేటలో 2.5 సెంటీమీటర్లు, మియాపూర్ లో 2.4 సెంటీమీటర్లు, కేపీహెచ్ బీలో 1.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీగా వానలు పడతాయని వెల్లడించింది వెదర్ డిపార్ట్ మెంట్. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే మళ్లీ వర్షాలు పడనున్నాయని పేర్కొన్నారు వాతావరణ శాఖ అధికారులు.