తెలంగాణలో ఇంకో మూడు రోజులు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ లో బలమైన ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం పడుతుందని అంచనా వేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడొచ్చని అధికారులు అంచనా వేశారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
తెలంగాణలోని 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్ కొనసాగుతోంది. నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, జనగామ, యాదాద్రి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో.. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాబాద్ జిల్లాలో ఐదోరోజూ జోరు వర్షం కురిసింది. అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో 16.45 సెంటీ మీటర్లు, నిర్మల్ జిల్లా మామడ మండలంలో 16.24 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.
వరంగల్ చౌరస్తా రహదారితో పాటు స్టేషన్ రోడ్ లో వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు వర్షానికి చాలా గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కొన్ని ఏరియాల్లో స్కూళ్లు, ఆస్పత్రుల్లోకి వరదనీరు చేరింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో ఉన్నాయి.
జగిత్యాల జిల్లాలో ధర్మపురి, బుగ్గారం మండలాల్లో జోరువానలు పడుతున్నాయి. హైదరాబాద్ లోని నెహ్రూ జూ పార్కులోకి భారీగా చేరిన వరద నీరు చేరింది. జూపార్కులోని సఫారీ పార్కును మూసేశారు అధికారులు.
Advertisements
అయితే.. ఉగ్ర గోదారి శాంతిస్తోంది. భద్రాచలం దగ్గర నీటిమట్టం తగ్గుతోంది. 51.80 అడుగుల దిగువకు వచ్చేసింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మాత్రం వరద ప్రవాహం కొనసాగుతోంది. 26 గేట్లు ఎత్తి నీటిని వదిలుతున్నారు అధికారులు. మరోవైపు భారీ వర్షాలతో బొగ్గు ఉపరితల గనులు చెరువులను తలపిస్తున్నాయి. రామగుండం-3 పరిధిలోని ఓసీపీ1, ఓసీపీ2లో ఉత్పత్తి నిలిచిపోయింది.