తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీగా వానలు పడతాయని వెల్లడించింది వెదర్ డిపార్ట్ మెంట్. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే మళ్లీ వర్షాలు పడనున్నాయని పేర్కొన్నారు వాతావరణ శాఖ అధికారులు.
కాగా బుధవారం హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచే వానలు మొదలయ్యాయి. సిటీలో సాయంత్రం వెదర్ ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉప్పల్, తార్నాక, రాజేంద్ర నగర్, పీర్జాదిగూడ, అత్తాపూర్, బండ్ల గూడ, కిస్మత్ పూర్, హిమాయత్ సాగర్, మణికొండ, బంజారాహిల్స్, అమీర్ పేట, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
భారీ వర్షంతో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీల్లో రోడ్లు చెరువులుగా మారాయి. కొద్దిపాటి వర్షానికే రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడం, ఇండ్లలోకి వరదనీరు వచ్చి చేరుతోందని వాపోతున్నారు. వర్షం కురిసిన ప్రతిసారీ ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయని చెబుతున్నారు. వరదనీటిలో ఇబ్బందులు పడుతున్నా స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు.
కాగా నగరంలోని అనేక ప్రాంతాల్లో వర్ష పాతం ఎక్కువగా నమోదైంది. సరూర్ నగర్ లో 3.2 సెంటీమీటర్లు, హబ్సిగూడ లో 3 సెంటీమీటర్లు, ఎల్.బీ.నగర్ లో 2.8 సెంటీమీటర్లు, మెట్టుగూడలో 2.3 సెంటీమీటర్లు, చర్లపల్లి లో 4.2 సెంటీమీటర్లు, బండ్లగూడ రామంతపూర్ లో 4.1 సెంటీమీటర్లు, ఏఎస్ రావు నగర్ లో 3.9 సెంటీమీటర్లు, చిలకనగర్ లో 1.8 సెంటీమీటర్లు, సీతాఫల్ మండీలో 2.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.