ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పడుతున్న వర్షాలకే అల్లాడుతున్న జనానికి మరో పిడుగులాంటి వార్త వినిపించింది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో ఇంకో మూడు రోజులపాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని తెలిపారు వాతావరణశాఖ అధికారులు. మంగళవారం తీరం వెంబడి ఈదురుగాలులు 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెప్పారు.
కృష్ణా, గుంటూరు జిల్లాలోనూ అతిభారీ వర్షాలు.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని అంటున్నారు. రాయలసీమ జిల్లాల్లోనూ రెండు రోజులు.. ఉరుములు, మెరుపులుతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించారు.